రబీకి ‘సాగర్’భరోసా | nizam sagar water availability Rabbi session | Sakshi
Sakshi News home page

రబీకి ‘సాగర్’భరోసా

Published Thu, Dec 19 2013 6:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

nizam sagar water availability Rabbi session

నిజాంసాగర్, న్యూస్‌లైన్: జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండ లా కళకళలాడుతుండడంతో అన్నదాతలు ఈ జలాశయంపై ఆశలు పెట్టుకున్నారు. రబీకి నీరివ్వడానికి అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. వారం రోజుల్లో ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. వరుణుడు కరుణించడంతో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండాయి. నెల క్రితం వరకు వర్షాలు కురువడంతో ఇప్పటికీ రికార్డు స్థాయిలో నీరు నిల్వ ఉంది. నాలుగేళ్లలో నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటం ఇదే ప్రథమం. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండడంతో రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకు నీరందుతుందని ఆశి స్తున్నారు.
 
 ప్రధాన కాలువ చివరి ఆయకట్టు ప్రాంతం వరకు రబీలో సుమారు 2.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రబీ పంటల సాగుకోసం అన్నదాతలు సైతం సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, బీర్కూర్, కోటగిరి, బోధన్, బాన్సువాడ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుచేశారు. డిస్ట్రిబ్యూటరి 28 పరిధిలో సుమారు 400 వందల ఎకరాల్లో శనగ, పొద్దుతిరుగుడు పంటల సాగుకోసం సాగర్ నీటితడులు అవసరం ఉన్నాయి. దీంతో ప్రాజెక్టునుంచి నీటిని వదలాలంటూ పలు మండలాల్లో ఆందోళనలు చేశారు.
 
 నాలుగు విడతల్లో..
 ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద సాగు చేయనున్న పంటలకు నాలుగు విడతల్లో నీటిని విడుదల చేయాలని ఇటీవల నిర్వహించిన డీఐబీ సమావేశంలో తీర్మానించారు. ఒక్కో విడతలో 2 టీఎంసీల చొప్పున నీటిని 15 రోజుల పాటు విడుదల చేస్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,405.2 అడుగులతో 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement