
సమైక్యం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు: అశోక్‌బాబు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలనే డిమాండ్ మినహా ముఖ్యమంత్రితో చర్చించడానికి ఏమీ లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టంచేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలనే డిమాండ్ మినహా ముఖ్యమంత్రితో చర్చించడానికి ఏమీ లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టంచేశారు. సీఎంతో చర్చలకు ప్రత్యేకంగా ఎజెండా ఏమీ లేదన్నారు. మంగళవారమిక్కడి ఏపీఏన్జీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చల్లో సీఎం స్పందించే తీరును బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలని ఎమ్మెల్యేలకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు.
విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక బాధపడుతున్న యువత, ఉద్యోగులకు మానసిక స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేస్తామని పార్టీలు హామీ ఇవ్వాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. బస్సులు, విద్యాసంస్థలు, కరెంట్ లేకుండా ప్రజల అల్లాడిపోతున్నా.. ఎంపీలు పదవులు పట్టుకొని వేలాడుతున్నారని దుయ్యబట్టారు. రాజీనామాలు చేశామని చెబుతున్న మంత్రులు ఢిల్లీలో అధికార నివాసాలు ఖాళీ చేసి, అధికారిక హోదాలు, సౌకర్యాలు వదులుకొని నియోజకవర్గాలకు రావాలని సూచించారు. మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించడానికి అశోక్‌బాబు నిరాకరించారు. తమ సభకు పోలీసు శాఖ ఇచ్చిన అనుమతిని హైకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల రిలేదీక్షలు
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారం రిలేదీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత ఆందోళన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలోని పాత మెయిన్‌గేటు వద్ద టెంటు ఏర్పాటు చేసి రిలేదీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు అశోక్‌బాబు సంఘీభావం తెలిపారు.