ఖమ్మం, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దెల బెంగ పట్టుకుంది. జిల్లాలో 15 ప్రాజెక్టుల పరిధిలో 3,670 అంగన్‌వాడీ కేంద్రాలు, 1218 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే ఇందులో 1634 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మరో 2,036 సెంటర్లు అవస్థల మధ్య అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే అద్దె డబ్బుతో సరైన ఇళ్లు దొరకడం లేదు. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా.. పిల్లల చిలిపి చేష్టలు, మల, మూత్ర విసర్జన ల మూలంగా ఒకటి రెండు నెలలకే కేంద్రాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో పెట్టే బేడా సర్దుకొని నెలకో సెంటర్‌కు మారాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నా.. అవి శిథిలావ స్థకు చేరుకున్నాయి. కిటికీలు ఊడి, తలుపులు విరిగి పోవడంతో ఆయా కేంద్రాలో నిల్వ ఉంచే పోషకాహారం, గుడ్లు కుక్కల పాలవుతున్నాయి. నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈఏ, ఇతర నిధుల ద్వారా మంజూరైన భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా యి. ఏళ్లు గడిచినా సగానికి పైగా పూర్తి కాలేదు. అయితే కొత్త వాటి నిర్మాణం పూర్తయ్యే లోపు ఇంతకు ముందున్న భవనాలు కూలి పోయే ప్ర మాదం ఉందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నాసిరకంగా నిర్మిస్తున్నా పట్టించుకునే వారే లేరని ఆరోపిస్తున్నారు.
చాలీచాలని అద్దెలతో ఇక్కట్లు...
చిన్న పిల్లలను పాఠశాలకు సన్నద్ధం చేయడం, కిశోర బాలికలు, బాలింతలకు ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుతో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ సెంటర్ల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. పలు కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె ఇళ్లలోనే నిర్వహిస్తున్నారు. అయితే సరిపడా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు చీటికి మాటికి ఖాళీ చేయిస్తున్నారు. గతంలో అర్బన్ పరిధిలో నెలకు రూ.750, రూరల్ పరిధిలో రూ. 200 చెల్లించేవారు. ప్రస్తుతం ఆర్బన్‌లో రూ. 3 వేలు, రూరల్‌లో రూ. 750 ఇస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా అద్దె చెల్లించకోపవడంతో ఇబ్బందులు తప్పడం లేదని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. మధిర మండలం మాటూరు ఎస్సీ కాలనీ, నిధానపురం బీసీ కాలనీ, మధిర పట్టణంలోని యాదవ బజార్ తదితర కేంద్రాలకు తక్కువ అద్దె చెల్లిస్తుండటంతో ఇరుకుగదులు, రేకుల షెడ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మాటూరు ఎస్సీ కాలనీలోని కేంద్రానికి కిటికీలు కూడా సక్రమంగా లేక ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పినపాక నియోజకవర్గంలోని పలు అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో నాణ్యత లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని భవనాలు...
అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరై ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికీ పూర్తి కాలేదు. గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా వివిధ పథకాల కింద 1047 కొత్త భవనాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 583 భవనాలు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు చెపుతున్నారు. వీటిలో బీఆర్‌జీఎఫ్ నిధుల ద్వారా 632 భవనాలు మంజూరు కాగా, 440 పూర్తయ్యాయి. 4 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండు మాత్రమే పూర్తయ్యాయి. నాబార్డు నిధుల కింద 146 భవనాలు మంజూరు కాగా, అందులో 51 మాత్రమే పూర్తయ్యాయి. 15 శాతం జనరల్ రెవెన్యూ ఫండ్‌లో భాగంగా మంజూరైన 90 కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల ద్వారా 90 కేంద్రాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం పూర్తయిందని అధికారులు చెపుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో నిర్మించినవి సగం కూడా లేవని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఐఏపీ మొదటి రెండు విడుతలలో మంజూరైన 157 కేంద్రాలు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి.
అంగన్‌వాడీలకు అద్దె బెంగ
Published Sat, Jan 11 2014 2:38 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement