విజయనగరం
జిల్లాలో 2011లో వెయ్యి మంది పురుషులకు.. 981 మంది స్త్రీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 957కి తగ్గింది. మరికొంత కాలం ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఆ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది.
జిల్లాలో లింగనిర్ధారణ చట్టం ఎంత శ్రద్ధగా అమలు చేస్తున్నారో ఈ గణాంకాలే తేల్చి చెబుతున్నాయి. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిసినా చాలా ప్రైవేటు క్లినిక్‌లు పట్టించుకోవడం లేదు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ‘డెకాయ్ ఆపరేషన్లు’ పూర్తి స్థాయిలో జరగడం లేదు. లక్ష్యంలో సగం కూడా చేరుకోలేకపోతున్నారు. 2013-14కు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 49 డెకాయ్ ఆపరేషన్లు చేయాలని నిర్దేశించింది. అయితే అధికారులు 24 ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఇంకా 25 ఆపరేషన్లు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నెల రోజుల్లో 25 డెకాయ్
ఆపరేషన్లు చేయడం కష్టమే.
డెకాయ్ ఆపరేషన్‌లో అధికారులు తమకు తెలిసిన గర్భిణిని స్కానింగ్ సెంటర్‌కు పంపిస్తారు. ఆమెతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు అక్కడే చాటుగా ఉంటారు. స్కానింగ్ సెంటర్‌లోకి వెళ్లిన గర్భిణి తనకు లింగ నిర్ధారణ వెల్లడించాలని, అందుకు ఫీజు చెల్లిస్తానని చెబుతుంది. అప్పుడు అధికారులు నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. దీన్నే డెకాయ్ ఆపరేషన్ అంటారు. ఈ ఆపరేషన్‌లో ఏ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడైనా పట్టుబడితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేస్తారు.
లింగ నిర్ధారణ వెల్లడిని అడ్డుకోవడం ద్వారా తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను అరికట్టాలన్నది డెకాయ్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. కాని అది పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఆడపిల్లలను చెత్తకుండీల్లోనూ, ఆస్పత్రుల్లోనూ వదిలేయడం, భ్రూణ హత్యలు వంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.