హైదరాబాద్‌పై రాజీ లేదు: కోదండరామ్
హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. జెఎసి విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 10 నుంచి సద్భావన యాత్ర చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌తో సహా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ డిమాండ్ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. రేపటి మంత్రి మండలి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇటువంటి కీలక తరుణంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు మౌనంగా ఉండడం సరికాదన్నారు. వస్తున్న తెలంగాణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే, మరికొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొడదాం - తెలంగాణను కాపాడుకుందాం అని పిలుపు ఇచ్చారు. డిజీపీ దినేష్‌రెడ్డిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన వారిని నియమించాలని ఆయన కోరారు. దినేష్‌రెడ్డి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.