కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మహిళల ఆర్థికాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం.. అంటూ పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. వడ్డీ లేని రుణాలు అంతంత మాత్రమే.
ఐకేపీ ద్వారా స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి 16 రకాల పథకాలు అమలులో ఉన్నాయి. వీటి అమలులో రాష్ట్రంలోని కర్నూలు జిల్లా 14వ స్థానంలో ఉండిపోయింది. పొదుపు ఉద్యమం 1996 ప్రాంతంలో జిల్లాలో మొగ్గ తొడిగి అభివృద్ధి చెంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికెక్కింది. అయితే రాను రాను పొదుపు సంఘాలను ప్రభుత్వ నిర్లక్ష్యం చేసింది. పదేళ్ల క్రితం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 50 వేల పొదుపు సంఘాలు ఉండగా నేడు 41257కు తగ్గిపోయాయి. అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 25 వేల గ్రూపులు ఉండగా ఇప్పుడు 18636 గ్రూపులు మాత్రమే ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో డీఆర్‌డీఏ-ఐకేపీ ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల్లో 17011 సంఘాలకు రూ.417.64 కోట్లు, అర్బన్ ప్రాంతాల్లో 4785 పొదుపు గ్రూపులకు బ్యాంకుల నుంచి రూ.82 కోట్లు రుణాలు ఇప్పించాలనేది లక్ష్యం. అయితే రూరల్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కేవలం 10079 గ్రూపులకు రూ.257.65 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. అర్బన్ ప్రాంతాల్లో 2500 గ్రూపులకు రూ.69.52 కోట్లు పంపిణీ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సంఘాలన్నింటికి వడ్డీ లేని రుణాలు అందాలి. కానీ వందలాది గ్రూపులకు వడ్డీ మినహాయింపు లభించడం లేదు.
అధికారుల లెక్కల ప్రకారమే 78 శాతం గ్రూపులకు మాత్రమే వడ్డీలేని రుణాలు లభిస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లోని సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నెల కంతులను అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తున్నాయి. తర్వాత వడ్డీ రీ యింబర్స్‌మెంట్ వస్తుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రకటించింది. రీయింబర్స్‌మెంట్ రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉండగా గతేడాది అక్టోబర్ వరకు రూ.4.99 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా 6.01 కోట్లు విడుదల కావాల్సి ఉంది.
అన్నీ అక్రమాలే..: పొదుపు మహిళలకు రుణాలు ఇప్పించడంలోను, వడ్డీలేని రుణాలు కల్పించడంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లింకేజీ రుణాలు ఇప్పించినందుకు బుక్ కీపర్ మొదలుకొని ఏపీఎం వరకు అన్నిస్థాయి వారు మామూళ్ల మత్తులో పడిపోయినట్లు స్పష్టమవుతోంది. 10 శాతం మామూళ్లకే సరిపోతుందని మహిళలు వాపోతున్నారు.
ఆ ఆరు నెల వడ్డీ ఎప్పుడు వచ్చేది..
స్వయం సహాయక సంఘాలకు 2012 జనవరి నుంచి వడ్డీ లేని రుణాలు మొదలయ్యాయి. జులై వరకు కంతు అసలు వడ్డీ చెల్లిస్తే రీయింబర్స్‌మెంటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2012 జనవరి నుంచి జులై నెల వరకు 34 వేల గ్రూపులకు రూ. 7 కోట్లు వడ్డీ రీ యింబర్స్‌మెంటు కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు విడుదల కాకపోవడం మహిళలు ఆశలు వదులుకుంటున్నారు.
పేరుకుపోతున్న బకాయిలు..
స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.44 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. సంఘాలు సరిగా రికవరీ చేయకపోవడానికి సిబ్బంది అవినీతే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయం సహాయక సంఘం ఏర్పడిన ఆరు నెలల తర్వాత బ్యాంకులు సంబంధిత సంఘాలకు రుణాలు ఇవ్వాలి. కానీ ఏళ్లు గడుస్తున్న ఇవ్వడం లేదు. ఇటువంటి సంఘాలు జిల్లాలో 15 వేల వరకు ఉన్నాయి. కాగా, ప్రతినెలా కంతును 24వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని డీఆర్‌డీఏ పీడీ నజీర్‌సాహెబ్ తెలిపారు.
వడ్డీ రాకపాయె.. రుణమూ లేకపాయె!
Published Sun, Jan 26 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement