కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : వివిధ పంటల సాగులో పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ 2014-15 సంవత్సరానికి సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో డీసీసీబీ అధ్యక్షురాలు చెరుకులపాడు కె.శ్రీదేవి అధ్యక్షతన గురువారం జిల్లా సాంకేతిక కమిటీ సమావేశమై పంట రుణాల పరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెంపుపై చర్చించింది.
పలు పంటలకు పంట రుణాల పరిమితిని పెంచుతూ సాంకేతిక కమిటీ నిర్ణయం తీసుకుంది. సమావేశం వివరాలను డీసీసీబీ అధ్యక్షురాలు వివరించారు. వరి, పత్తి తదితర అన్ని పంటల్లో పెట్టుబడి వ్యయం పెరిగినందున 2014 ఖరీఫ్, 2014-15 రబీ సీజన్‌లలో పంట రుణాల పరిమితిని పెంచినట్లు తెలిపారు. ఇందుకు సాంకేతిక కమిటీలోని బ్యాంకర్ల ఆమోదం తెలిపారని వివరించారు. వరికి ఈ ఏడాది రూ.24 వేల ప్రకారం పంట రుణాలు ఇవ్వగా, వచ్చే ఖరీఫ్‌లో 26 వేలు ఇచ్చే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు. పత్తిలో పంట రుణ పరిమితిని రూ.25 వేల నుంచి రూ.27 వేలకు పెంచినట్లు చెప్పారు. పత్తి విత్తనోత్పత్తికి ఈ ఏడాది రుణ పరిమితి రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఉందని, దీనిని రూ.65 వేల నుంచి రూ.70 వేలకు పెంచినట్లు వివరించారు.
వేరుశెనగకు 15 వేల నుంచి 16 వేలకు, మిరపకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు రుణ పరిమితిని పెంచినట్లు వివరించారు.
పసుపు సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఉన్న పంట రుణాల పరిమితిని రూ.40 వేల నుంచి రూ.45 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ప్రకారం పంట రుణాలు ఇస్తుండగా, దీనిని రూ.14 వేల నుంచి రూ.16 వేలకు పెంచినట్లు వివరించారు. ఉల్లి సాగు రూ.10 వేల నుంచి రూ.12 వేలు రుణ పరిమితి ఉండగా దీనిని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. పెంచిన రుణ పరిమితి వచ్చే ఖరీఫ్ నుంచి అమలు అవుతుందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ బి.వి.సుబ్బారెడ్డి, ఎల్‌డీఎం అండవార్, నాబార్డు డీజీఎం కళ్యాణ సుందరం, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.