ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తాం: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సంఘం కార్యవర్గ ఎన్నికలపై రాజకీయాల ప్రభావం ఏమాత్రం ఉండబోదని సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. నామినేషన్ల ఘట్టం మాదిరిగానే జనవరి 5న జరిగే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంతంగానే ముగుస్తుందన్నారు. సోమవారం ఏపీఎన్జీవోల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితానే ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నామన్నారు. జాబితాలో మార్పులు చేర్పులు చేశామని వచ్చిన ఆరోపణలను ఖండించారు.
అఫిడవిట్లు కోరతాం
ఈనెల 21వతేదీన జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న పార్టీలను కలుపుకొని సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అశోక్‌బాబు చెప్పారు. జనవరి 3 నుంచి అసెంబ్లీ తిరిగి సమావేశం కానున్నందున పార్టీలతో మరోమారు సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ అఫిడవిట్లు ఇవ్వాలని ప్రతి పార్టీని, ప్రజాప్రతినిధిని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరపున కోరనున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలపై కక్షకట్టిన కొన్ని ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయాయని, ఉద్యోగులను ప్రసన్నం చేసుకుంటే ఎంతో కొంత లాభం చేకూరుతుందని కొన్ని పార్టీలు ఆశపడుతున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, కోశాధికారి విజయేంద్రబాబు, నగర కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.
బరిలో 33మంది అభ్యర్థులు
జనవరి 5న జరగనున్న ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారని ఎన్నికల అధికారి సి.హెచ్.హనుమంతరావు చెప్పారు. మొత్తం 34 నామినేషన్లు రాగా కె.వసంతరావు అనే అభ్యర్థి సోమవారం నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో రిటైరైన ఉద్యోగుల పేర్లు ఉండడంపై వివరణ ఇస్తూ పోలింగ్ రోజున వ్యక్తమయ్యే అభ్యంతరాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు.