మందుబాబుల జేబులు గుల్ల | No Price List on Wine Shops Guntur | Sakshi
Sakshi News home page

మందుబాబుల జేబులు గుల్ల

Published Sat, Apr 20 2019 12:17 PM | Last Updated on Sat, Apr 20 2019 12:17 PM

No Price List on Wine Shops Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: వైన్‌ షాపుల ముందు ధరల పట్టిక ఉండాలి.. హోలోగ్రామ్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలి.. మద్యం హోల్‌సేల్‌గా అమ్మకూడదు.. 21 ఏళ్ల లోపువారికి విక్రయించకూడదు.. ఇవన్నీ మద్యం దుకాణాల వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు. అయితే, నేడు అవి నీటి మీద బుడగల్లా మారాయి. మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి లాభాలే లక్ష్యంగా నిబంధనల్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుగుతున్నా ఎక్సైజ్‌ అధికారుల్లో చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బార్‌ కోడింగ్‌ అమలు, దుకాణాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు, ఆన్‌లైన్‌ బిల్లు వంటి నిబంధనలు తప్పనిసరి చేసినా చాలాచోట్ల అమలు కావడం లేదు.

నెలకు రూ. 130 కోట్ల వ్యాపారం
జిల్లాలో 185 బార్లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 3–4కోట్ల చొప్పున నెలకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతోంది. జిల్లాలో రోజురోజుకు మద్యం విక్రయాలు పెరగడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రజా ప్రతినిధుల అండదండలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా విక్రయాలు కొనసాగిస్తూ జేబులు నింపుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనండి.. లేకుంటే వెళ్లిపోండనే సమాధానాన్ని మందుబాబులు రుచి చూస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో తెనాలి, రేపల్లె, పల్నాడు సహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టుషాప్‌లు వెలిశాయి. వీటిని అంతా టీడీపీకి చెందిన వారే నిర్వహించడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం సాహసించలేక పోతున్నారు.

మూణ్ణాళ్ల ముచ్చటగా హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానం
మాన్యువల్‌ మద్యం అమ్మకాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం ఎక్సైజ్‌ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ అమ్మకాల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. హెడోనిక్‌ పార్ట్‌ ఫైండర్‌ సిస్టమ్‌ (హెచ్‌పీఎఫ్‌ఎస్‌) విధానం రాష్ట్రవ్యాప్తంగా  2015 జులై 1వ తేదీ నుంచి అన్ని వైన్‌ షాపులు, బార్‌లలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా వైన్‌ షాపుల్లో ఎమ్మార్పీ, బ్యాచ్‌ నంబర్, డిపో నుంచి మద్యం షాపు వరకు జరిగే విక్రయాలు పూర్తిగా నమోదు అవుతాయి. అయితే, ఇది నామమాత్రంగానే అమలవుతోంది. అధికారులు కేవలం మౌఖికంగానే చెప్పటానికే పరిమితమయ్యారనే విమర్శలు వినవస్తున్నాయి. పలు దుకాణాల్లో కంప్యూటర్‌ వినియోగం లేకుండా పోయిందని తెలుస్తోంది. హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానం సరిగా అమలు కాకపోవడం వల్ల కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. ఈ విధానం సరిగా అమలు జరిగితే ఉదయం 10 గంటల కన్నా ముందు, రాత్రి పది గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరిపితే అధికారులకు వెంటనే సమాచారం తెలిసిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ అమ్మడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు వినియోగదారులకు కంప్యూటర్‌ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధనలు అన్ని పాటిస్తే తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానాన్ని పాటించడం లేదు. దీనివల్ల కల్తీ మద్యం బాటిళ్లు పట్టుబడినప్పుడు అవి ఎక్కడి నుంచి తయారై వచ్చాయో గుర్తించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎమ్మార్పీకి అదనం
జిల్లాలో ఏ మద్యం షాప్‌ చూసిన ఎమ్మార్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. క్వార్టర్‌కు రూ.5 నుంచి రూ. 10 అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. బీర్ల విక్రయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి కావడంతో డిమాండ్‌ పెరిగింది. దీంతో కృతిమ కొరత సృష్టించి పలు ప్రాంతాల్లో నిర్వాహకులు బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని బాటిల్స్‌లోనే విక్రయించాలి. కానీ జిల్లాలోని అన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా లూజుగా విక్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఖరీదైన మద్యం సీసాల్లో మధ్య రకం బ్రాండ్లను కలిపి మందుబాబులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బార్‌లలో ఎమ్మార్పీ వర్తించవన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని యజమానులు సర్వీసు చార్జీల పేరుతో వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. ఈ విషయాలన్నీ చూసీ చూడనట్టు వదిలేసే ఎక్సైజ్, స్థానిక పోలీసు అధికారులకు నెలనెలా మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వున్నాయి.

కఠినంగా వ్యవహరిస్తాం
సిగ్నల్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే బార్‌ కోడింగ్‌ విధానం అమలులో లేదు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం మా దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.– ఎం. ఆదిశేషు,ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ డీసీ, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement