సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు.
అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్‌గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది.
ఎక్స్‌పోర్టు హబ్‌గా మారుస్తాం
గుంటూరును మిర్చి ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
– ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు
చిల్లీస్ బోర్డు ఏర్పాటు చేయాలి
స్పైసెస్ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్‌కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్
ధర ‘తేజో’మయమే
ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్‌కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేల వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్ రూ.23 వేలకు పైగా పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment