చక్కెరకు చేదు కాలం..!
న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్ మొదటి మూడు నెలల్లో (2014-15, అక్టోబర్-డిసెంబర్) చక్కెర ఉత్పత్తి 27.3 శాతం పెరిగింది. 2013-14 అక్టోబర్-డిసెంబర్ మధ్య 5.86 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాగా ఇపుడది ఏకంగా 7.46 మిలియన్ టన్నులకు ఎగసింది. ఇలా ఉత్పత్తి పెరగటం వల్ల ధరలు తగ్గుతున్నాయని, ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువకు ధరలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ) ఒక ప్రకటనలో పేర్కొంది.
దీనివల్ల నిర్దిష్ట సమయంలో చెరకు రైతులకు పరిశ్రమలు డబ్బులు చెల్లించలేకపోతున్నాయని తెలిపింది. ‘‘ముడి చక్కెరపై ఎగుమతి సబ్సిడీని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలా చేస్తేనే చక్కెర ధరలు పెరిగి చెరకు రైతులకు తగినంత ధర చెల్లించగలుగుతాం’’ అని అసోసియేషన్ పేర్కొంది. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది చక్కెర రికవరీ శాతం కూడా ఎక్కువగా ఉందని సంస్థ తెలియజేసింది. దేశంలో అత్యధికంగా చెరకును ఉత్పత్తి చేసే రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది చెరకు దిగుబడి దాదాపు 55 శాతం పెరగటం ఈ సందర్భంగా గమనార్హం.