సాక్షి, అమలాపురం: ఇరవై ఏళ్ల క్రితం కొబ్బరి పొట్టు నిరుపయోగ వ్యర్థ పదార్థం. దీనిని వదిలించుకోవడం పీచు పరిశ్రమల యజమానులకు తలకు మించిన భారంగా ఉండేది. కొబ్బరి పీచుకు ధర ఉంటేనే పరిశ్రమలు నడవడం.. లేదంటే మూసేయడంలా ఉండేది. కానీ.. ఆ వ్యర్థమే ఇప్పుడు బంగారమైంది. కొబ్బరి పొట్టును ఇటుకల తయారీలో వాడితే లాభమని గుర్తించారు.
ఇటుక తేలిక కావడంతోపాటు ఆకర్షణీయమైన రంగు రావడంతో బట్టి యజమానులు దీని కొనుగోలు మొదలు పెట్టారు. ఆ తరువాత దీని నుంచి అత్యంత నాణ్యమైన కంపోస్టు తయారవుతోందని గుర్తించడంతో కంపోస్టును ఇటుక (కోకోపీట్ బ్లాక్)లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో దీని దశ తిరిగింది. నష్టాల్లో ఉన్న పీచు పరిశ్రమల ఉనికిని ఇప్పుడు కొబ్బరి పొట్టు కాపాడుతోంది.
రాష్ట్రంలో ఏడాదికి 24 వేల టన్నుల పొట్టు
రాష్ట్రంలో చిన్నాపెద్ద కలిపి సుమారు 950 వరకు కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 550 వరకు ఉన్నాయి. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మెట్రిక్ టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇందులో విద్యుత్ వాహకత (ఎలక్ట్రిక్ కండెక్టివిటీ–ఈసీ) 6 నుంచి 8 శాతం వరకు ఉంటోంది.
అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా.. తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే.. దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. అదే ఇటుకల రూపంలో అయితే టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.26 వేలు పలుకుతోంది. ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసే అమెజాన్, ఇండియా మార్ట్ వంటి సంస్థలు కేజీ రూ.25 నుంచి రూ.55 వరకు కోకో బ్రిక్ అమ్మకాలు చేస్తున్నాయి.
విదేశాలకు కోకోపీట్ బ్లాక్స్
కొబ్బరి పొట్టు ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. వీటిలో గుజరాత్‌ది అగ్రస్థానం. ఇక్కడి నర్సరీలకు మట్టికన్నా కొబ్బరి పొట్టు మేలైన ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, అమెరికా, నెదర్‌ల్యాండ్, ఆస్ట్రేలియాలకు పొట్టుతో తయారు చేసిన బ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మొత్తం కొబ్బరి పొట్టు ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే బ్లాక్ రూపంలో వెళుతుండగా.. 20% కంపోస్టు రూపంలోను, 70% ఇటుక బట్టీలకు వెళుతోంది.
మంచి డిమాండ్ ఉంది
అంతర్జాతీయంగా కోకోపీట్ బ్లాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఎగుమతులకు వీలుగా కొబ్బరి పొట్టును తక్కువ ఈసీకి తీసుకువచ్చి బ్లాక్‌లుగా తయారు చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మాకు స్థానికంగా ఇటుక బట్టీలకు అధికంగా వెళుతోంది. క్వాయర్ పరిశ్రమలు నడుస్తున్నాయంటే అందుకు కొబ్బరి పొట్టే కారణం. – నండూరి ఫణికుమార్, క్వాయర్ పరిశ్రమ యజమాని
Comments
Please login to add a commentAdd a comment