నిరక్షరాస్యత నిర్మూలన కోసం అమలు చేస్తున్న సాక్షర భారత్ విషయంలో ప్రభుత్వం వింత పోకడలు పోతోంది. సాక్షర భారత్‌లో ఇప్పటికే పని చేస్తున్న కోఆర్డినేటర్లకు నెలలుగా వేతనాలివ్వని ప్రభుత్వం.. కొత్తగా బోధకులను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది విమర్శలకు తావిస్తోంది.
మోర్తాడ్, న్యూస్‌లైన్ :
జిల్లాలోని 36 మండలాలకుగాను 27 మండలాల్లో మహిళల అక్షరాస్యత 50 శాతం కంటే తక్కువగా ఉంది. ఆయా మండలాల్లో అక్షరాస్యత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆరు నెలల్లో అక్షరాస్యత పెంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సాక్షర భారత్‌కు అనుబంధంగా ఆయా మండలాల్లో బోధకులను నియమించాలని నిర్ణయించింది.
అసలుకు లేదు..
సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్‌లకు ప్రతి నెల రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్‌లకు నెలకు రూ 2 వేల చొప్పున ప్రభుత్వం వేతనాలను చెల్లించాల్సి ఉంది. అయితే నెలలుగా ఈ వేతనా లు చెల్లించడం లేదు. దసరా, దీపావళి పండుగల సందర్భం గా మూడు నెలల వేతనాలు చెల్లించారు. ఇప్పటికీ మండల కోఆర్డినేటర్‌లకు ఏడు నెలలు, గ్రామ కోఆర్డినేటర్‌లకు పది నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారి కి ఉత్తి చెయ్యి చూపుతూ గ్రామాలలో కొత్తగా బోధకులను నియమించాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. బకాయిలను చెల్లించాలని కోఆర్డినేటర్లు కోరుతున్నారు.
534 గ్రామాలలో..
జిల్లాలో నిజామాబాద్, భీమ్‌గల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, ఎడపల్లి, రెంజల్, బాన్సువాడ మండలాల్లోని 184 గ్రామాలు మినహాయించి మిగిలిన 27 మండలా ల్లో ఉన్న 534 గ్రామాలలో బోధకులను నియమిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఇద్దరేసి బోధకులను నియమించి నిరక్షరాస్యులకు పాఠాలు చెప్పిస్తారు. పాఠాలు చెప్పినందుకు బోధకులకు నెలకు రూ వెయ్యి చొప్పున వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఇందుకు అర్హులు. ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గం బోధకుల పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాయి. ఈ వారంలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నా రు. అక్షరాస్యత శాతం పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం బోధకులను నియమిస్తోందని సాక్షర భారత్ ప్రాజెక్టు అధికారి వీరేశం తెలిపారు. ఈనెలలో బోధకులతో పని చేయిస్తామని, ఒక్కొక్కరు ఆరు నెలల్లో 30 మందిని అక్షరాస్యులను చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
‘సాక్షర భారత్’లో వింతపోకడ
Published Mon, Dec 2 2013 1:46 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement