తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ పరిస్థితి ఏమిటని మాట్లాడుతున్నారేగానీ రైతుల గురించి కానీ, సాగునీటి సమస్య గురించి కానీ ఆలోచించే నాయకులు ఎవరూ లేరని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు(రంగరాజు) ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విడిపోయినా, రాయల తెలంగాణ గా వేరుపడినా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నది జలాలు 811 టీఎంసీలు మాత్రమే రాష్ర్టం వినియోగించుకోవాల్సి ఉండగా అదనంగా మరో 200 టీఎంసీలు వాడుకుంటున్నామన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు బోర్డులు వస్తాయన్నారు. అలా వస్తే అవి జాతీయ ప్రాజెక్టులుగా మారి ఇప్పటి మాదిరిగా నీటిని వాడుకొనే అవకాశంలేక నీటి సమస్య ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. రాయల తెలంగాణ ఏర్పడితే రాయలసీమ ప్రయోజనాల కోసం కట్టిన శ్రీశైలం దాని పరిధిలోకి వెళ్లి కృష్ణా డెల్టా ఉనికికి ప్రమాదకరంగా మారుతుందన్నారు. జలవిద్యుత్ కోసమని కట్టిన ఈ ప్రాజెక్టులను ఇంత వరకు నీటి అవసరాలకు వాడుకుంటున్నామని, రాష్టం విడిపోతే ఇలాంటి హక్కులను కోల్పోతామని పేర్కొన్నారు. మిగులు జలాలు వాడుకుంటామని రాయలసీమలో నిర్మించిన తెలుగు గంగ, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులకు నీరు రాని పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. తెలంగాణ లో ఎలాంటి ప్రాజెక్టులు లేవు కనుక సీమాంధ్రప్రాంతానికి ఎగువన కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇలాంటి తీవ్రమైన విషయాలను గమనించకుండా కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. 1956కు ముందుతూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఖమ్మం జిల్లాలోవిలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే భద్రాచలం డివిజన్ ను ఆంధ్రాలో కలిపేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారని, అయితే ప్రస్తుతం అక్కడి ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని అంటున్నారని పేర్కొన్నారు.
ఈ డివిజన్‌ను ఆంధ్రాలో కలపకపోతే పోలవరం ప్రాజెక్టునుంచి ఇక్కడకు నీళ్లొచ్చేది అనుమానమే అన్నారు. నీటి సమస్య, విద్యుచ్ఛక్తి, ఉద్యోగస్తులు, హైదరాబాద్ వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో తెరమీదకు తేవాల్సి ఉండగా, కేవలం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారా... కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుతారా... అనే కోణంలో రైతులు, నీటి సమస్యలను విస్మరించి ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నీటి విషయాలపై ప్రత్యేక దృష్టి వహించి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్వార్థపర ప్రయోజనాల కోసం ఇలాంటి విషయాలను మర్చిపోతే భావితరాల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, దీనికి మరో ప్రత్యామ్నాయం లేనేలేదన్నారు.
విడిపోతే ఎడారే
Published Wed, Aug 7 2013 5:16 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement