వెంకట్రామన్నగూడెంలో విషాదం
Published Thu, Aug 8 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్: ముద్దు ముద్దు మాటలతో అలరిస్తున్న మూడేళ్ల చిన్నారి మరణం ఆ కన్న తల్లిదండ్రులకు కడుపుకోతకు గురిచేసింది. కళ్ల ముందే తమ కంటిపాప విగతజీవిగా మారేసరికి ఆ కుటుంబం రోదనకు అంతులేకుండా పోయింది. ఆ చిట్టి పాప బోసి నవ్వులు ఇక లేవనే నిజం తెలిసి బంధువులతో పాటు చుట్టుపక్కల వారూ ఆవేదనకు గురయ్యారు. బుధవారం వెంకట్రామన్నగూడెంలో నీళ్ల తొట్టెలో పడి సకాలంలో వైద్యం అందక మృతి చెందిన చిన్నారి ఝాన్సీ (3) ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకట్రామన్నగూడెం గ్రామానికి చెందిన నాగబాబు, రత్నం కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఝాన్సీ (3) ఉన్నారు. వీరు గతంలో సమీప బంధువైన బొట్టా నారాయణమూర్తి ఇంటిలో అద్దెకు ఉండేవారు. ఇటీవలే నాగబాబు స్థలం కొనుక్కొని తాటాకిల్లు కట్టుకోవడంతో ఆ ఇంటికి వెళ్లిపోయారు. చిన్నారి జాన్సీ మాత్రం నారాయణమూర్తి ఇంటికి వెళ్లి అక్కడి పిల్లలతో ఆడుకుంటుంది.
బుధవారం నాగబాబు కుమార్తె జాన్సీతో కలిసి నారాయణమూర్తి ఇంటికి వెళ్లాడు. నాగబాబు, నారాయణమూర్తి టీవీ చూస్తుండగా జాన్సీ పిల్లలతో ఆడుకుంటూ ఇంటి ఆవరణలోని నీటితొట్టెలో పడిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికి జాన్సీ కోసం నాగబాబు, నారాయణమూర్తి చుట్టుపక్కల గాలించారు. నారాయణమూర్తి కుమారుడు శ్రీనుకు అనుమానం వచ్చి నీటి కుండీ దగ్గరకు వెళ్లిచూడగా అందులో కొట్టుకుంటోంది. వెంటనే బయటకు తీసి బాలికను భుజాన్న వేసుకుని సమీపంలోని పీహెచ్‌సీ వద్దకు వెళ్లగా అక్కడ అటెండర్ పట్టిం సుబ్బారావు మాత్రమే ఉన్నాడు. ఈ ఘటన మధ్యాహ్నం 1.15 గంటలకు జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో పీహెచ్‌సీలో వైద్యాధికారి ఆశాకిరణ్ పెదతాడేపల్లిలో నిర్వహించే 104 సేవలు కార్యక్రమానికి వెళ్లగా శిరీష అనే మరో వైద్యురాలు, సిబ్బంది అందుబాటులో లేరు. అటెండర్ సుబ్బారావు బాలికను పరిశీలించి పొట్టలో ఉన్న నీటిని బయటకు కక్కించాడు. అప్పుడు బాలిక మెదిలినట్లు పాప బంధువులు తెలిపారు. అయితే వైద్యులు లేకపోవడంతో చికిత్స అందక బాలిక మృతి చెందింది. జాన్సీ తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది.
బంధువులు, గ్రామస్తుల ఆందోళన
వైద్యులు లేకపోవడంతోనే తమ చిన్నారి చనిపోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు రోడ్డుకు అడ్డుగా టెంట్‌వేసి ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. స్థానిక అధికారులు డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు అందించారు. ఆర్డీవో సూచనల మేరకు గూడెం తహసిల్దార్ వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో శకుంతల కూడా పీహెచ్‌సీకి వచ్చి వైద్యులను, సిబ్బందిని విచారించారు. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
వైద్యులు, సిబ్బంది తీరుపై ఫిర్యాదు
ఈ సందర్బంగా పీహెచ్‌సీలో డాక్టర్లు, సిబ్బంది తీరుపై డీఎంహెచ్‌వోకు, తహసిల్దార్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఉదయం 8 గంటలకు తీయాల్సిన ఆసుపత్రి పది గంటలకు తీస్తున్నారని, 12 గంటలకు మూసి వేస్తున్నారని ఆరోపించారు. వైద్య సేవలకు అటెండరే దిక్కవుతున్నాడని వాపోయారు. డీఎంహెచ్‌వో శకుంతల ఆదేశాల మేరకు బాలికకు వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలోనే పోస్టుమార్టం చేశారు. తాడేపల్లిగూడెం సీఐ చింతా రాంబాబు, ఎస్సైలు తిలక్, భగవాన్‌ప్రసాద్, కొండలరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement