ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు
Published Sun, Nov 10 2013 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
కాకినాడ లీగల్, న్యూస్‌లైన్ :రాష్ర్ట విభజన ప్రక్రియను కేంద్రం ఆపే వరకు న్యాయవాదులు పోరాటాన్ని కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.జయకర్ పిలుపునిచ్చారు. వంద రోజులుగా కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్‌లో శనివారం జరిగిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ల స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల సదస్సుకు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ అలీ అధ్యక్షత వహించారు. జయకర్ మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణపై రెండు గంటల పాటు చర్చించారు. సమైక్యాంధ్ర కోసం తాము ఉద్యమ బాట పట్టిన తర్వాత ఏపీఎన్జీఓలు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఒత్తిళ్లకు తలొగ్గి సమ్మెను విరమించారని, దీనివల్ల ఉద్యమ తీవ్రత తగ్గిన మాట వాస్తవమేనన్నారు.
న్యాయవాదులు, గుమస్తాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ, సమైక్యాంధ్ర సాధించాలన్న బలమైన కాంక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తు న్నారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 23 వరకు జేఏసీ కార్యాచరణను అమలు చేసి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎ.రామిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు చేసే ఉద్యమానికి అనుకున్న స్థాయిలో ప్రచారం లభించడం లేదన్నారు. అందువల్ల ఇది గ్రామ స్థాయికి వెళ్లడం లేదన్నారు. జేఏసీ కోఆర్డినేటర్ వి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జేఏసీలో కొందరి నిర్లిప్తత వల్ల ఉద్యమం అనుకున్న స్థాయిలో వేగం పుంజుకోవడం లేదన్నారు. పూర్తి స్థాయిలో పనిచేసే వారితో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జవహర్ అలీ మాట్లాడుతూ కేంద్రం విభజన వైపు అడుగులు వేస్తున్నందున, ఏపీఎన్జీఓలతో పాటు మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తిరిగి సమ్మెబాట పట్టాలన్నారు.
స్టీరింగ్ కమిటీ సమావేశం రహస్యంగా నిర్వహించడం సరికాదని, బహిరంగ సదస్సు ఏర్పాటు చేసి పరిణామాలపై విస్తృత చర్చ జరగాలంటూ గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన న్యాయవాదులు సమావేశం వద్ద కొద్దిసేపు గలాటా సృష్టించారు. సమావేశంలో జేఏసీ రాష్ర్ట కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, బార్ కౌన్సిల్ సభ్యులు బొగ్గవరపు గోకులకృష్ణ, కలగట్ల తమ్మనశెట్టి ఎస్.కృష్ణమోహన్, ఎస్.మాధవీలత, కె.చిదంబరం, ఎస్.రాజేంద్రప్రసాద్, ఎన్.ద్వారకానాథ్ రెడ్డి, వి.బ్రహ్మారెడ్డి, గంటా రామారావు, గువేరా రవి, బార్ సంఘ అధ్యక్షులు జి.రామ్మోహన్, బద్రినాథ్, పీఎల్‌ఎన్ ప్రసాద్, రామకృష్ణ, ఎన్‌వీఎస్ మూర్తి, కృష్ణారావు, ఈవీ రామిరెడ్డి, విశ్వనాథరెడ్డి, రాజేష్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement