జిల్లాలో వాయిదాపడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో వాయిదాపడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18న ఏడు సర్పంచ్, 150 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది జూలై 23 నుంచి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. భారీ వర్షాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు.
స్థానాలు ఇవే..
దండేపల్లి మండలం గూడెం, బేల మండలం కొబ్బాయి, తాంసి మండలం వడ్డాడి, కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్, చింతగూడ, తలమడుగు మండలం రుయ్యాడి, తాంసి మండలం బండల్‌నాగాపూర్ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గూడెంలో ఎస్టీ రిజర్వేషన్ కాగా అక్కడ ఎస్టీ ప్రజలు, ఓటర్లు లేకపోవడంతో ఎన్నికలు జరగలేదు. తెలంగాణ నినాదంతో కొన్ని గ్రామాల్లో అప్పట్లో ఎన్నికలను బహిష్కరించారు. ఇంకొన్నింటికి నామినేషన్లు రాలేదు. భారీ వర్షాల కారణంగా కూడా కొన్నిచోట్ల ఎన్నికలు జరగలేదు. గూడెం, కొబ్బాయిలో సర్పంచ్‌తోపాటు అన్ని వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మొత్తంగా 150 వార్డు స్థానాల్లో కూడా జరగనున్నాయి.
నామినేషన్లు ఇలా..
ఈనెల 3 నుంచి 6వ తేది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేయవచ్చు. 7న స్క్రూట్నీ, 8న ఆర్డీవోకు అప్పీల్, 9న అభ్యంతరాల పరిష్కరణ, 10న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం వరకు ఫలితాన్ని ప్రకటిస్తారు.