ఎన్టీఆర్ పింఛన్‌కు ఎన్ని పాట్లో | NTR pensions so many problems | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పింఛన్‌కు ఎన్ని పాట్లో

Published Tue, Jun 7 2016 12:37 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM

ఎన్టీఆర్ పింఛన్‌కు ఎన్ని పాట్లో - Sakshi

ఎన్టీఆర్ పింఛన్‌కు ఎన్ని పాట్లో

బ్యాంకు ఖాతా తప్పనిసరి చేసిన వైనం
వృద్ధులు, వికలాంగులకు అవస్థలు
జిల్లాలో ప్రహసనంగా పింఛన్ల పంపిణీ

 
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అందిస్తున్న సామాజిక భద్రత పింఛన్లు పొందేందుకు ఎన్నో పాట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. పంపిణీ విషయంలో ఇప్పటికే చేసిన మార్పులతో గగ్గోలు పెడుతున్నారు. పదేపదే పంపిణీ విధానాన్ని మార్చడంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. కొన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు, మరికొన్ని రోజులు సర్వీస్ ప్రొవైడర్లు, ఇంకొన్ని రోజులు పోస్టాఫీసులు ద్వారా తాజాగా బ్యాంకుల్లో నేరుగా నగదు జమ చేస్తామని అంటున్నారు. ఇచ్చే వెయ్యి రూపాయల కోసం ఎన్ని పాట్లు ఎదుర్కోవాల్సి వస్తోందనని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆవేదన చెందుతున్నారు.
 
సత్తెనపల్లి/గురజాల: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీకి బ్యాంకు ఖాతా తప్పనిసరి చేయడంతో వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉన్న వారు ఖాతా నెంబర్లు, ఆధార్, రేషన్ కార్డులు నకళ్లు అందజేస్తుండగా లేని వారు ఖాతాలను ప్రారంభించి ఇవ్వాలని చెబుతున్నారు. దీంతో కదల్లేని వృద్ధులు, వికలాంగులు, ఇంటి వద్ద ఒక్కరే ఉన్న వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కనీసం కాలకృత్యాలైనా తీర్చుకోవడానికి బయటకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వృద్ధులు తమ పరిస్థితి ఏమిటని లబోదిబో మంటున్నారు.


60 శాతం మందికి ఖాతాలు నిల్
జిల్లాలో పింఛన్ల పంపిణీ త్వరలో బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడానికి గాను లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఖాతాల నకళ్లను తీసుకొని అంతర్జాలం లో పొందుపర్చనున్నారు. కొంత మంది వృద్ధులకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వృద్ధులు 1,61,241 మంది, వితంతువులు 1,28,997 మంది, వికలాంగులు 42,621 మంది, చేనేత 6,398 మంది, కల్లు గీత కార్మికులు 868 మంది, అభయహస్తం 23,517 మంది, మొత్తం 3,69,642 మంది ఫింఛను దారులు ప్రతి నెలా రూ. 36.84 కోట్లు సొమ్ము పొందుతున్నారు. కాగా సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 81 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. 60 శాతం మందికి పైగా వృద్థులు, వికలాంగులు, వితంతువులకు బ్యాంకు ఖాతాలు లేవు.


పంచాయతీల ద్వారా అందించాలి
నాకు 85 ఏళ్లు. పింఛను కోసం నడవ లేక ఇక్కడ వరకు వస్తున్నా. ఇక్క రోజులు తరబడి ఉండాల్సి వస్తుంది. గతంలో పంచాయతీ కార్యదర్శి ఇంటికే వచ్చి ఇచ్చి పోయే వాడు. ఇప్పడు మళ్ళీ బ్యాంకులు అంటే చాలా ఇబ్బంది. నర్రా రాములు, వృద్ధుడు
 
బ్యాంకులంటే ఇబ్బందే
బ్యాంకుల ద్వారా పింఛను పంపిణీ చేస్తే ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంకులకు వెళ్ళటం అలవాటు లేక పోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికి పింఛను కోసం మూడు రోజుల నుంచి వస్తున్నా. మా లాంటి వృద్ధులు ఇక బ్యాంకులకు వెళ్ళి తీసుకోవడం అంటే ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవాలి. అల్లు పున్నమ్మ, వృద్ధురాలు
 
 
మెలికలతో అవస్థలు
పింఛన్లు నేరుగా ఇచ్చేస్తే ఎంతో బాగుండేది. మెన్నటి వరకు పోస్టాఫీసులు చుట్టూ తిప్పారు. నిన్నటి వరకు పంచాయతీ కార్యాలయానికి రమ్మన్నారు. ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి రావాలంటున్నారు. తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కలిగివుండాలని మరో కొత్త నిబంధన  పెట్టడంతో ఏమి చేయాలో అర్థంకావడం లేదు.  కొత్తపల్లి దయమ్మ, గురజాల.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement