భూకంప జోన్‌లో ‘అణు’ పార్కా?
Published Tue, Dec 29 2015 9:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో తరచూ వస్తున్న భూప్రకంపనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజుల్లో రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో మూడుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నాటి ప్రకంపనలు రెక్టారు స్కేలుపై 3.5గా నమోదుకాగా ఆదివారం కూడా ఉనికిని ప్రదర్శిం చాయి. భూకంప జోన్‌గా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే నిపుణులు అంటున్నారు. ఈనేపథ్యంలో కొవ్వాడవద్ద అణువిద్యుత్ పార్కు ఏర్పాటు విషయమై ప్రభుత్వాలు పునరాలోచించకపోవడం చర్చనీయాంశమవుతోంది. రణస్థలం మండలం కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2016 మార్చినాటికి భూ సేకరణ పూర్తి చేసి పార్కు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముడు నెలల్లో ఈ పార్కు పనులు ప్రారంభం కానుండటం, ప్రస్తుతం వరుస భూప్రకంపనలు చోటుచేసుకోవడం ఇక్కడి ప్రజానీకాన్ని కలవరపరుస్తున్నాయి. కొవ్వాడలో అణుపార్కు నిర్మాణం పూర్తయ్యాక భూప్రక ంపనలు చోటుచేసుకుంటే ఆ ముప్పు ఊహించడానికే ఇబ్బందికరమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీని ప్రభావం 300 కిలో మీటర్లు వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ నుంచి ఒరిస్సా వరకు ఈ ప్రభావం కొన్ని తరాలు రేడియేషన్‌ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 2011లో యూపీఏ హయాంలో అణుపార్కుకు జీవోలు విడుదలయ్యాయి. అప్పట్లో బీజేపీ,టీడీపీ దీనిని వ్యతిరేకించాయి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు నిర్మాణానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస భూప్రకంపనలను దృష్టిలో పెట్టుకుని పార్కు రద్దు చేయాలంటూ స్థానిక ఉద్యమ నాయకులు ప్రధానికి లేఖలు రాస్తున్నారు.
జియోలాజికల్ ఆఫ్ ఇండియా కూడా గతంలో భూకంపజోన్‌లో అణుపార్కులు ప్రమాదానికి దారితీస్తాయని తేల్చిచెప్పింది. కొవ్వాడ సమీపంలో భూపొరల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. భూమి లోపల పలకలు సర్దుకునే సమయాన ప్రకంపనలు తప్పవని, తీవ్రత రెక్టార్ స్కేల్‌పై ఆరు దాటితే పెనుముప్పు తప్పదని శాస్త్రవేత్తలంటున్నారు. మరోసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పక్కాగా సర్వేచేసి ఈ ప్రాంతం అణుపార్కుకు అనుకూలమో కాదో తెలియ జేయాలని పలువురు సూచిస్తున్నారు.
అణు పార్కుల్లో పనిచేసే వారికి ప్రైవేట్ సంస్థలు బీమా చేయడానికి ముందుకు రావ డం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపం చ బ్యాంకు సైతం రుణం మంజూరు చేయక పోవటం,ప్రమాదకర రియాక్టర్లు వినియోగించటం వంటివి కూడా ఆందోళనకర అంశాలు. నిర్మాణంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని పోరాట కమిటీ సభ్యులు కోరుతున్నారు.
భవిష్యత్తు తరాలకు తీరని నష్టం
భూకంప జోన్‌లో అణుపార్కు ఏర్పాటు వల్ల భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతుంది. ప్రమాదం సంభవిస్తే 300 కిలో మీటర్లు పరిధిలో ఈ రేడియేషన్ ఉంటుంది. హిరోషిమా, నాగసాకి వంటి పరిస్థితి స్థానిక ప్రజలకు ఉంటుంది.అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశా. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాశాను. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. భూకంపజోన్‌లో అణుపార్కు అంటూ ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేకపోవటమే.
- ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఎఎస్ అధికారి
Advertisement
Advertisement