ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: కళ్లెదుటే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కబ్జాదారుల నుంచి కాసులు తీసుకుని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములును కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అండగా నిలుస్తుండడంతో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించే వరకూ విశ్రమించని అధికారులు.. బడాబాబులు, రాజకీయ నేతల అనుచరులు కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఖమ్మం నగరానికి కార్పొరేషన్ హోదాతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. తమ పలుకుబడి, డబ్బు వెదజల్లి అక్రమార్కులు అందినంత దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి, పరిరక్షించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందం వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో పలు ప్రాంతాలలో రెవెన్యూ భూములను గుర్తించలేకపోతున్నారని తెలుస్తోంది.
భూ ఆక్రమణలకు సంబంధించి కొన్ని వివరాలిలా ఉన్నాయి...
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రానైట్‌కు లీజుకు తీసుకున్నారు. అయితే పక్కనే ఉన్న మరో 20 ఎకరాలపైనా అక్రమార్కుల కన్ను పడింది. దీంతో రెవెన్యూ యంత్రాంగానికి కాసుల ఎరచూపించి ఆ భూమిలోనూ గ్రానైట్ రాళ్ల తవ్వకం ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ నిర్మాణ సమయంలో ఎన్నెస్పీ క్వార్టర్లు ఏర్పాటు చేసిన స్థలంతో పాటు కాలువ పక్కన ఉన్న భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఎన్నెస్పీ పరిధిలో ఉన్న స్థలాల్లో చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో కాలువ పక్కన పట్టణానికి సమీపంలో ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని మరీ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా మిన్నకుండా ఉండటంతో ఈ ఆక్రమణలకు అంతులేకుండా పోతోంది.
ఖమ్మం రూరల్ మండలం కైకొండాయిగూడెం రెవెన్యూ పరిధిలోని 223 సర్వే నంబర్‌లో గల 3 ఎకరాల 2 కుంటల ప్రభుత్వ భూమిని మరో సర్వే నంబర్ పేరుతో విక్రయించేందుకు రియల్ వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం రెవెన్యూ పరిధిలోని కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూమిని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించారని పలుమార్లు ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు మాత్రం ఆ భూమిని సర్వేచేసి ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెపుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేసిన దాఖలాలు లేవు.
ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో సుమారు 300 గజాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరించారు.
ఖమ్మంలో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురువుతున్నాయి. ఈ భూములను కొందరు అధికార పార్టీకి చెందిన నేతలే కబ్జా చేశారు. ఇది తెలిసినా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పాటు కాసుకులకు కక్కుర్తి పడే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికార, ప్రతిపక్ష నేతలు ఆక్రమించుకున్నారంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించినా.. నేతలకు తలొగ్గి వెనుదిరిగారనే విమర్శలున్నాయి.
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలో కేంద్రియ విద్యాలయం వద్ద 137 సర్వే నంబర్‌లో సుమారు 200 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గొల్లగూడెం పంచాయతీ పరిధిలో కోట్ల రూపాయల విలువ గల చెరువును సైతం ఆక్రమించి ప్లాట్లుగా మార్చారు.
ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, తెల్దారుపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని కొందరు రియల్ వ్యాపారులు చదును చేశారు. దీనికి ఎన్‌ఓసి తెచ్చేందుకు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ
Published Thu, Aug 22 2013 6:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement