బంజారాహిల్స్: బోగస్ డాక్యుమెంట్లతో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో రిటైర్డు సర్వేయర్ కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 13ఏలో టీఎస్ నంబర్ 3/1, బ్లాక్ -ఎస్, వార్డు 11, సర్వే నంబర్ 403లో ప్రభుత్వ స్థలం ఉంది. బుధవారం ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన సర్వేయర్ ఎం.రామారావు, బహదూర్‌పురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్‌ఏ.రిఫీక్, ఎండి.సాదిక్ తదితరులు ఈ ప్రభుత్వ స్థలంలోకి వెళ్లి కొలతలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న షేక్‌పేట తహసీల్దార్ చంద్రకళ సిబ్బందితో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్లి మీరెవరంటూ ప్రశ్నించారు. ఇక్కడ 925 గజాల ప్లాట్ ఉందని, దీన్ని తాము ఖరీదు చేశామని వారు తెలిపారు.
అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపించారు. అయితే, ఈ స్థలం పక్కాగా ప్రభుత్వానిదని రికార్డులున్నాయని, ఈ ప్లాట్‌కు సంబంధించిన సర్వే నంబర్ వారిచ్చిన రికార్డుల ప్రకారం ఇక్కడ లేదంటూ తహ సీల్దార్ స్పష్టం చేశారు. అయితే, ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామంటూ వారు వాగ్వాదానికి దిగగా వెంటనే ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో రామారావు, రఫీక్, ఎండీ సాదిక్‌లను అరెస్టు చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ప్రవేశించటం, తవ్వకాలు చేపట్టటం, స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించటం, బోగస్ డాక్యుమెంట్లను సృష్టించటంపై తహసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని తహసీల్దార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నం, ముగ్గురి అరెస్టు
Published Wed, Apr 20 2016 5:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement