ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవాదాయశాఖ ఆస్తుల పరిరక్షణ సెల్ పరిధిలోని దేవాలయ భూముల్లో ఆక్రమణలు చేసిన వారిపై ఆయా ఆర్డీఓలకు ఫిర్యాదులు
బొబ్బిలి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవాదాయశాఖ ఆస్తుల పరిరక్షణ సెల్ పరిధిలోని దేవాలయ భూముల్లో ఆక్రమణలు చేసిన వారిపై ఆయా ఆర్డీఓలకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సెల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. మంగళవారం బొబ్బిలి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ ఈ సెల్ ఉందన్నారు. ఆక్రమణకు గురైన దేవాలయ భూములపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని రామతీర్థాలకు చెందిన 750 ఎకరాల భూమిని దన్నానపేట, తంగుడుపల్లి గ్రామస్తులు అనుభవిస్తుండంతో అక్కడ సర్వే జరిపామని పేర్కొన్నారు. దేవాదాయ భూముల్లో అనధికారికంగా సాగు చేస్తే చర్యలు తప్పవని, శిస్తులు చెల్లించాలని స్పష్టం చేశామన్నారు.
బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన దాదాపు 476 ఎకరాల భూములను బలిజిపేట మండలం అజ్జాడకు చెందిన రైతులు అక్రమంగా సాగు చేస్తున్నారని చెప్పారు. వీరందరికీ నియమ నిబంధనలు చెప్పామని, బహిరంగ వేలంలో పాల్గొనమని సూచించామని పేర్కొన్నారు. అలా చేయకపోతే దేవాలయాల వద్ద ఫ్లెక్సీలు పెట్టి అనధికారికంగా సాగు చేస్తున్న రైతుల పేర్లను పెడతామని స్పష్టం చేశారు. తాజాగా జీఓల ప్రకారం దేవాలయాల భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కరపలో వెంకటేశ్వరస్వామికి చెందిన 25 ఎకరాల భూమి అన్యాక్రాంతమైతే అక్కడ ఆర్డీఓకు ఫిర్యాదు చేశామన్నారు. రాజధాని సమీపంలోని దేవాలయాల భూములపై కూడా దృష్టి సారించాలన్ని ఉందన్నారు. దేవాలయాల్లోని 43 రిజిస్టర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈయనతో పాటు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పుష్పనాథం తదితరులు పాల్గొన్నారు.