స్థానిక దోసపాటి చెరువు ఆక్రమణకు గురైంది. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న చెరువు భాగంలో దాదాపు వంద ఎకరాలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది.
ఆక్రమణలకు కాదేదీ అనర్హం అన్నట్టు చిన్న తరహా నీటి వనరులపైనా కబ్జాదారుల కన్నేస్తున్నారు. అందినకాడికి దున్నేస్తున్నారు. సరైన వర్షాలు లేక, సాగు చేపట్టలేక చతికిల పడుతున్న రైతులు ఆక్రమణదారులతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 500 ఎకరాలకు సాగునీరందించే దోసపాటి చెరువు భూముల్లో పాగా వేయడం సాగర్ జలాల పారుదలకు అడ్డంకిగా మారింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు నీళ్లు లేక బీళ్లుగా మారడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆక్రమణలను తొలగించి సాగర్ జలాలు ఇవ్వాలని చేస్తున్న విజ్ఞప్తులు అధికారుల చెవిని సోకడం లేదు. వానలు లేక, సాగర్ జలాలు రాక సాగుచేపట్టే దారి లేక అచ్చంపేట ప్రాంత రైతులు బిక్క మొహాలతో దిక్కులు చూస్తున్నారు.
అచ్చంపేట: స్థానిక దోసపాటి చెరువు ఆక్రమణకు గురైంది. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న చెరువు భాగంలో దాదాపు వంద ఎకరాలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వచ్చే మార్గాలు మొత్తం మూసుకుపోయాయి. భారీ వర్షం పడితేనే ఈ చెరువు నిండుతుంది. కానీ ఆ స్థాయి వర్షం రెండు మూడేళ్లుగా కురవలేదు.
నీళ్లు లేక చెరువు ఆయకట్టులోని 500 ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. వీటిలో 150 ఎకరాలు మాగాణి భూములు కాగా, మిగిలిన 350 ఎకరాలు మెట్టభూములు ఉన్నాయి. ఏటా చెరువు నిండుతుందని ఎదురు చూస్తున్న రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మండలంలోని వేల్పూరు, చిగురుపాడు, ఓర్వకల్లు, రుద్రవరం చెరువు లు కూడా నీళ్లు లేక కళతప్పాయి. వీటిలో కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. వీటి పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి.
ఆక్రమణలను తొలగించి నాగార్జున సాగర్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నా అధికారులను పట్టించుకోవడం లేదు.సాగర్ నుంచి వచ్చే నీటిని చెరువులకు మరల్చుకునే మార్గాలు మూసుకు పోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
చెరువుల ఆయకట్టులోని భూముల్లో ఏటా సమృద్ధిగా పంటలు పండించుకునేవారు. రెండేళ్లుగా చెరువులు నిండకపోవడంతో దిగువన ఉన్న భూములు మొత్తం బీళ్లుగా మారుతున్నాయి.చెరువుకు నీళ్లు రావాలంటే....
దోసపాటి చెరువు నిండాలంటే ముందుగా తాళ్లచెరువులో ఉన్న అదాటి చెరువు నిండాలి. అక్కడ నుంచి నీళ్లు రావాలంటే ముందుగా ఆక్రమణలను తొలగించాల్సి ఉంది.
ఈ రెండు చెరువుల మధ్య ఉన్న భూములు, కాలువలను కొంతమంది ఆక్రమించుకోవడం వల్లనే సాగునీళ్లు రావడం లేదు.చింతపల్లి మేజర్ కాలువ నుంచి నేరుగా దోసపాటి చెరువుకు నీటి సరఫరా చేసినట్లయితే ఏటా చెరువు కింద ఉన్న 500 ఎకరాల భూముల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చొరవచూపి దోసపాటి చెరువు నింపేందుకు ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు.