nagarujna sagar
-
సాగర్ పై నిర్లక్ష్యం నీడ
విజయపురిసౌత్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు బహువిధ ప్రయోజనకారి అయిన నీటి మళ్లింపు మార్గం (డైవర్షన్ టన్నెల్) సుమారు 40 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురవుతోంది. మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గేటు ద్వారా నీరు కూడా వృథా అవుతోంది. నిత్యం నీరు లీకై దిగువ కృష్ణానదిలో కలుస్తోంది. ఇలా ఏడాది పొడవునా వెళ్లే నీటితో హైదరాబాద్ వంటి నగరంలో సగ భాగానికి తాగునీరు సరఫరా చేయవచ్చని సాగునీటి శాఖ రిటైర్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. దీనిని మూసివేయడమే పరిష్కారమని నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై నాలుగు నెలల క్రితం ఓ కమిటీని వేశారు. డైవర్షన్ టన్నెల్‌ను పరిశీలించి అభిప్రాయాలను తెలియజేయాలని సాగునీటి శాఖ ఆ కమిటీని కోరింది. గత నెలలో హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైన కమిటీ ఆ టన్నెల్‌ను మూసివేసే కోణంలో ఆలోచన చేసిన ట్లు సమాచారం. సాగర్ నిర్మాణ సమయంలో నీటిని మళ్లించడానికి దీనిని ఉపయోగించారు. డ్యాం పూర్తికాగానే వాస్తవంగా దీనిని మూసివేయాలి. కాని సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన సమయంలో క్రస్ట్‌గేట్లతో పాటు దీని గేట్లను ఎత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తే నీటితో పాటు సిల్ట్(బురద) వె ళ్లే అవకాశాలుంటాయని నిపుణులు భావించి డైవర్షన్ టన్నెల్‌ను అలానే ఉంచారు. కాని దానిగేట్లు మట్టిలో కూరుకుపోవడంతో దాని పనితీరులో మార్పు వచ్చింది. వివిధ గేట్ల ద్వారా నీరు వెళ్లేతీరు ఇలా.. సాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడానికి నీటి మట్టాన్ని బట్టి వివిధ గేట్లను ఉపయోగిస్తుంటారు. 590 నుంచి 546 అడుగుల వరకు 26 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. 510 అడుగుల వరకు ఎడమ కాలువకు, 500 అడుగుల వరకు కుడి కాలువకు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 489 అడుగుల వరకు నీటిని విడుదల చేసే వీలుంది. జలాశయం 489 నుంచి 400 అడుగుల నీటి మట్టానికి చేరినప్పుడు కృష్ణాడెల్టాకు తాగునీటిని అందించడానికి డ్యాంకు ఇరువైపులా ఉన్న రెండు సూట్గేట్లని ఉపయోగిస్తారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆంధ్రప్రాంతానికి తాగు నీటినందించడం కోసం, జలాశయం నీటిమట్టం 400 నుంచి 300 అడుగుల వరకు ఉన్నప్పుడు నీటిని వదలడానికి మళ్లింపు మార్గం (డైవర్షన్ టన్నెల్)గేటును రూపొందించారు. దీనిద్వారా నీటిని వదిలే సమయంలో సిల్ట్ వెళ్లే అవకాశాలుండేవి. ప్రధాన డ్యాంకు సీపేజీ మరమ్మతు పనులు చేపట్టాలన్నా దీనిద్వారానే నీటిని వదలాల్సి ఉంది. ఇకపై అలాంటి పరిస్థితి రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టు ఉండటంతో కనీస నీటి నిల్వలను జలాశయంలో ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఎల్లప్పుడు 530 అడుగుల నీటిని సాగర్‌లో నిల్వ ఉంచాలనే డిమాండ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ టన్నెల్ మార్గాన్ని మూసివేయడమే మంచిదనీ, అవసరమైనప్పడు తెరుచుకునేలా అవకాశం ఉంచి మూసివేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో నీరు వృథా కాకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
రబీ రైతు బెంగ
మాచర్ల టౌన్ : నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటిమట్టాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. నీటి విడుదలకు సంబంధించి ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు లేఖలు రాసుకున్నా రైతులను ఆందోళన వీడడం లేదు. సాగు, తాగునీటి అవసరాలు పెరిగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రైతులు రబీసాగుపై బెంగ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాడెల్టా కింద సాగు, తాగు నీటి కోసం అవసరమైన జలాలను విడుదల చేయాలని వారం రోజుల కిందట కోరింది. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీరు తగ్గిపోవటంతోపాటు, ఇప్పటికే అవసరాలకు తగ్గవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని ఉపయోగించుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ కుడి కాలువకు నీటిని నిలుపుదల చేయటంతో జల జగడం ఏర్పడింది. తీవ్ర వాదోపవాదాలు, ఘర్షణ అనంతరం నీటి విడుదలకు గేట్లు ఎత్తారు. కనిష్టస్థాయికి చేరువలో శ్రీశైలం రిజర్వాయర్ ప్రతి రోజు కుడికాలువ నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గడంతో జల విద్యుత్ కేంద్రం నుంచి నీటిని విడుదల చేయటంలేదు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎడమ కాలువకు ప్రస్తుతం 8,997 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం మొత్తం సాగర్ రిజర్వాయర్ నుంచి 14,525 క్యూసెక్కులు అవుట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి కేవలం 3,222 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ ఇప్పటికే 834 అడుగులకు తగ్గిపోయింది. మరో రెండు అడుగులు తగ్గితే హైకోర్టు ఆదేశాల మేరకు కనిష్ట స్థాయి అయిన 832 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగర్‌కు మరో రెండు రోజుల్లో శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో ఆగిపోనుంది. సాగర్ నుంచి మరో 20 అడుగులు మాత్రమే... ఇదిలా ఉండగా కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ సాగర్ నీటిని విడుదల చేస్తుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతుంది. అదే విధంగా సాగర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల అధికంగా ఉండడంతో నీటి మట్టం 529.80 అడుగులకు పడిపోయింది. శ్రీశైలం నుంచి రెండు అడుగులు, సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 అడుగులు మాత్రమే నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 510 అడుగుల వద్ద డెడ్ స్టోరేజీగా నమోదవుతుంది. అప్పటి వరకు మాత్రమే నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు నింపాల్సిఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండో పంటకు నీటిని కోరటం, ఇక్కడ కృష్ణా డెల్టా కింద దాళ్వాకు నీటి అవసరం ఉండడంతో పంటలు పండేవరకు నీరు వస్తుందా రాదా అని రైతులు ఆందోళనలో ఉన్నారు. కుడికాలువ పరిధిలో ప్రస్తుతం లక్ష ఎకరాల్లో మిర్చిపంట, రెండున్నర లక్షల ఎకరాల్లో మాగాణి, 50 వేల ఎకరాల్లో ఇతర పంటలకు నీటి అవసరాలు ఉన్నాయి. మరో వైపు తాగునీటి అవసరాలకు చెరువులు, కుం టలు నింపుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రబీ సాగును ఎలా కాపాడుకోవాలనీ, చివరి వరకు ప్రభుత్వం నీరు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయంగా ఏ చర్యలు చేపట్టాలని ఆలోచిస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గాయి : షేక్ జబ్బార్ , కెనాల్స్ ఈఈ సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గాయి. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాగర్ కుడికాలువ పరిధిలో వేసిన పంటలకు మార్చి 31వ తే దీ వరకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ పంటలకు దశల వారిగా నీటిని విడుదల చేస్తూ, చెరువులు, కుంటలను నింపి తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నీటిని వృథా చేయకుండా వేసిన పంటలకు మాత్రమే వినియోగించుకోవాలి. -
సంగ్రామ సాగర్
మాచర్ల టౌన్/విజయపురిసౌత్: నాగార్జున సాగర్ కుడికాలువకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా అడ్డగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్అధికారులు, పోలీసులు వాదులాడుకొని ఘర్షణ పడ్డారు. నీటి విడుదలకు శుక్రవారం ఆంధ్ర ప్రభుత్వ అధికారులు గురజాల, మాచర్ల పోలీస్ రెవెన్యూ వర్గాలతో కలసి ప్రాజెక్టు పైకి వెళ్లినప్పటి నుంచి రాత్రి 8.30గంటల వరకు ఘర్షణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆంధ్ర రైతులకు నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఆదిత్యదాస్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని తీసుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు పైకి వెళ్లిన అధికారులకు పలుసార్లు అవమానాలు జరిగాయి. లింగంగుంట్ల సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కుడికాలువ ఇరిగేషన్ అధికారి కృష్ణారావు, ఈఈ జబ్బర్, ఆర్డీవో మురళి, డిఎస్పీ నాగేశ్వరావు, సీఐ చిన్న మల్లయ్యలను ఏదో విధంగా అడ్డగించి అవమానపరిచి కుడికాలువ గేటు ఎత్తకుండా తెలంగాణ అధికారులు వ్యూహం పన్నారు. తెలంగాణ అధికారులు సాగర్ ప్రాజెక్టుపై శుక్ర వారం ఉదయం 9గంటల నుంచే మోహరించారు. ఎవరు డ్యాం పైకి రావాలన్నా ప్రాజెక్టు ఎస్ఈ విజయభాస్కర్ అనుమతి తీసుకొనిరావాలని డ్యాం సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే మాచర్ల కెనాల్స్ డీఈ నజీర్ అహ్మద్ ఎస్ఈ కృష్ణారావులు వేర్వేరు సమయాలలో రాగా సెక్యూరిటీ వారు అడ్డగించి అవమానించారు. దీంతో వారు తమ వాహనాలలోనే అరగంటకు పైగా ఉండిపోయారు. ఆ తరువాత డ్యాం ఆర్ఐ భాస్కర్ అనుమతితో ప్రాజెక్టు పైకి వెళ్లారు. ఒక దశలో సాగర్ కుడికాలువ గేట్ల వద్ద కిందకు వెళ్లకుండా నీటిని విడుదల చేయనీయకుండా చేసేందుకు ఆంధ్ర అధికారులపై పోలీసులను ఉసిగొల్పారు. తెలంగాణ పోలీసు అధికారులతో సహ సిబ్బంది ఆంధ్ర అధికారులపై ఎదురుదాడి చేసి ఘర్షణ పడ్డారు. దీనిని అడ్డగించే ప్రయత్నంలో ఉన్న ఆంధ్ర పోలీసులపై తెలంగాణ పోలీసులు ఘర్షణ పడగా అనివార్య పరిస్థితులలో ఆంధ్ర పోలీసులు కూడా తిరగపడ్డారు. ఈ విధంగా ఐదు గంటల పాటు తెలంగాణ అధికారులు హైడ్రామా నడిపి నీటి విడుదలను అడ్డగించటమే ధ్యేయంగా వ్యవహరించారు. ఉన్నతాధికారులు వచ్చి చర్చలు జరిపినా కుడికాలువకు నీటి విడుదల కొలిక్కి రాలేదు. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేస్తుండగా, ఎడమ కాలువకు 8 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంటున్నారు. ఈ హైడ్రామా మొత్తాన్ని తెలంగాణ అధికారులు పెత్తనం పేరుతో నిర్వహించి ఆంధ్ర అధికారులను అన్ని రకాలుగా అవమానపర్చారు. అయినా ఆంధ్ర అధికారులు వెన్ను చూపక నీటి విడుదలకు చివరి వరకు వాదులాటకు దిగి తమ ప్రయత్నాలు కొనసాగించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి... రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు తీసుకొని కుడి కాలువ రైతుల ప్రయోజనాన్ని కాపాడవల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్యను జటిలం చేయటంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని నిలుపుదల చేసే వరకు పట్టించుకోకుండా సింగపూర్, మలేషియా ఇతర దేశాలలో చక్కర్లు కొట్టి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను సీఎం చంద్రబాబు విస్మరించారన్నారు. విజయపురిసౌత్ రివర్వ్యూ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో చర్చించిన అనంతరం ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూడు లక్షల మంది రైతులు పంటలు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కుడికాలువకు నామమాత్రంగా నీటిని ఇవ్వటం అత్యంత దారుణమన్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి సమస్యను జటిలం చేసే విధంగా కుడికాలువ గేట్లను పగలకొడతామని ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు. నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని ఆయన కోరారు. తమ పార్టీ తరఫున రైతుల హక్కులు కాపాడేందుకు ఉద్యమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాచర్ల జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తోటకూర పరమేశ్వరావు, అల్లు వెంకటరెడ్డి, నోముల కృష్ణ, బూడిద శ్రీను తదితరులు ఉన్నారు. -
చెరువులో పాగా చేలు పండేదెలా ?
ఆక్రమణలకు కాదేదీ అనర్హం అన్నట్టు చిన్న తరహా నీటి వనరులపైనా కబ్జాదారుల కన్నేస్తున్నారు. అందినకాడికి దున్నేస్తున్నారు. సరైన వర్షాలు లేక, సాగు చేపట్టలేక చతికిల పడుతున్న రైతులు ఆక్రమణదారులతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 500 ఎకరాలకు సాగునీరందించే దోసపాటి చెరువు భూముల్లో పాగా వేయడం సాగర్ జలాల పారుదలకు అడ్డంకిగా మారింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు నీళ్లు లేక బీళ్లుగా మారడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆక్రమణలను తొలగించి సాగర్ జలాలు ఇవ్వాలని చేస్తున్న విజ్ఞప్తులు అధికారుల చెవిని సోకడం లేదు. వానలు లేక, సాగర్ జలాలు రాక సాగుచేపట్టే దారి లేక అచ్చంపేట ప్రాంత రైతులు బిక్క మొహాలతో దిక్కులు చూస్తున్నారు. అచ్చంపేట: స్థానిక దోసపాటి చెరువు ఆక్రమణకు గురైంది. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న చెరువు భాగంలో దాదాపు వంద ఎకరాలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వచ్చే మార్గాలు మొత్తం మూసుకుపోయాయి. భారీ వర్షం పడితేనే ఈ చెరువు నిండుతుంది. కానీ ఆ స్థాయి వర్షం రెండు మూడేళ్లుగా కురవలేదు. నీళ్లు లేక చెరువు ఆయకట్టులోని 500 ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. వీటిలో 150 ఎకరాలు మాగాణి భూములు కాగా, మిగిలిన 350 ఎకరాలు మెట్టభూములు ఉన్నాయి. ఏటా చెరువు నిండుతుందని ఎదురు చూస్తున్న రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మండలంలోని వేల్పూరు, చిగురుపాడు, ఓర్వకల్లు, రుద్రవరం చెరువు లు కూడా నీళ్లు లేక కళతప్పాయి. వీటిలో కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. వీటి పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఆక్రమణలను తొలగించి నాగార్జున సాగర్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నా అధికారులను పట్టించుకోవడం లేదు.సాగర్ నుంచి వచ్చే నీటిని చెరువులకు మరల్చుకునే మార్గాలు మూసుకు పోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చెరువుల ఆయకట్టులోని భూముల్లో ఏటా సమృద్ధిగా పంటలు పండించుకునేవారు. రెండేళ్లుగా చెరువులు నిండకపోవడంతో దిగువన ఉన్న భూములు మొత్తం బీళ్లుగా మారుతున్నాయి.చెరువుకు నీళ్లు రావాలంటే.... దోసపాటి చెరువు నిండాలంటే ముందుగా తాళ్లచెరువులో ఉన్న అదాటి చెరువు నిండాలి. అక్కడ నుంచి నీళ్లు రావాలంటే ముందుగా ఆక్రమణలను తొలగించాల్సి ఉంది. ఈ రెండు చెరువుల మధ్య ఉన్న భూములు, కాలువలను కొంతమంది ఆక్రమించుకోవడం వల్లనే సాగునీళ్లు రావడం లేదు.చింతపల్లి మేజర్ కాలువ నుంచి నేరుగా దోసపాటి చెరువుకు నీటి సరఫరా చేసినట్లయితే ఏటా చెరువు కింద ఉన్న 500 ఎకరాల భూముల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చొరవచూపి దోసపాటి చెరువు నింపేందుకు ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు. -
అడుగంటుతున్న ‘సాగర్’
విజయపురి సౌత్ నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి దగ్గర పడుతుండటం ఆయకట్టు రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వర్షాలు సరిగా పడకపోవటంతో ఇప్పటికే ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాగర్‌లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో ఖరీఫ్ పంటలకు నీరందే అవకాశం కనిపించటం లేదు. గతేడాది సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో గేట్లను ఎత్తేశారు. దీంతో రెండు పంటలూ పండి రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎగువ జలాశయూలదీ అదే పరిస్థితి.. కృష్ణా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని జలాశయాలకు ఇన్‌ఫ్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి 125 టీఎంసీల నీరు చేరితేనే కర్ణాటక ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేస్తుంది. మహారాష్ట్రలోని తుంగభద్ర జలాశయం పరిస్థితి అలానే ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల్లోకి సుమారు 225 టీఎంసీల నీరు వస్తే శ్రీశైలం జలాశయానికి నీటిప్రవాహం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం కూడా డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 834.20 అడుగులు కాగా కేవలం 54.1501 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయ పూర్తి సామర్ధ్యం 215.8 టీఎంసీలు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రత్యేక అవసరాలకు మినహాయిస్తే నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువకు వెళ్లడానికి లేదు. సాగర్ పరిస్థితి ఇదీ.. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు. అంటే 131.6690 టీఎంసీలు. కాగా ఆదివారానికి నీటిమట్టం 514 అడుగుల వద్ద ఉంది. ఇది 138.5610 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 469, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 6,004 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం ఔట్‌ఫ్లో 6,473 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి చుక్కనీరు కూడా రావటంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగర్ నుంచి 8 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల 3వ తేదీ వరకు కృష్ణా డెల్టాకు నాలుగున్నర టీఎంసీల నీటిని విడుదల చేశారు. మరో రెండున్నర టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. ఇక జంట నగరాల తాగునీటి అవసరాలకు జూలై, ఆగ స్ట్ నెలల్లోరెండు టీఎంసీలు అవసరమవుతాయి. అలాగే కుడి, ఎడమ కాలువల ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడకపోతే గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. -
పర్యాటక కేంద్రంగా శ్రీపర్వతారామం
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్‌లో శ్రీపర్వతారామాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చందనాఖన్ తెలి పారు. బుద్ధపూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలోని సమావేశ మంది రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆమె మాట్లాడారు. అనంతరం వ్యాలీ ఆఫ్ స్థూపాస్, బుద్ధభూమి, బోధిసత్వ పార్కు జాతక ప్యానల్, శ్రీపర్వతారామం బ్రోచర్, మహోన్నత భారతీయుడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయం తీరంలో నిర్మించిన శ్రీపర్వతారామం, ప్రవేశద్వారం, బుద్ధచరిత వనం, స్థూపవనం, శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన బుద్ధవిగ్రహాలను శ్రీపర్వతారామానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప బౌద్ధ పర్యాటక స్థావర ంగా దేశ,విదేశీయులను ఆకర్షిస్తుందన్నారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ఒక భాగం కూడా పూరి ్తకాలేదని రూ. 22 కోట్లు మంజూరు కాగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని తెలిపారు. ఇదిపూర్తయితే పర్యాటక అభివృది ్ధసంస్థకు ఆదాయాన్ని, స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఎండీ కే.ఎస్‌రెడ్డి, ఈడీ మధుసూదన్, ఏడీసీ.శ్రీనివాస్, రాష్ట్ర ఆర్ట్‌గ్యాలరీ డెరైక్టర్ శివనాగిరెడ్డి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి శకుంతల ,బొర్ర గోవర్దన్, సాగర్ డీవీఎమ్ వెంకటేశ్వర్రావు, డీటీఓ మహీధర్ పాల్గొన్నారు. అలరించిన చండాలిక నృత్యనాటిక బుద్ధజయంతి ఉత్సవాల భాగంగా పర్యాటక శాఖ నిర్వహించిన చండాలిక నృత్యనాటిక ఆహుతులను అలరించింది. అంటరానితనాన్ని పారదోలిన బుద్ధుని శిష్యుడు ఆనందునికి దప్పిక తీర్చడానికి ప్రకృతి అనే చండాలిక నీరు పోసిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. పద్మశ్రీ అవారు ్డ గ్రహిత శోభానాయుడు, శిష్యురాలు శ్రీదేవి బృందం ప్రదర్శనను, ఈ నాటకాన్ని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆమెను ప్రశంసించారు. ప్రారంభమైన రైలు శ్రీపర్వతారామంలో పర్యాటకలను అ న్ని ప్రాంతాలకు తిప్పడానికి రైలును ప్రారంభించారు. పిల్లలు,పెద్దలు శ్రీపర్వతారామంలో రెలైక్కి సందడి చేశారు. సమావేశమందిరం చిన్నగా ఉండడంతో సందర్శకులంతా నిలబడే నాటక ప్రదర్శనను చూశారు. -
చకచకా ‘ట్రాష్‌రాక్’
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్ సాగర్ ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పాదన కేంద్రం అవుట్లెట్ చానల్స్‌కు 40మీటర్ల దూరంలో ట్రాష్‌రాక్ నిర్మిస్తున్నారు.సాగర్ జలాశయంలోకి నీటిని తోడేసే సమయంలో రాళ్లు, చెత్తచెదారం రాకుండా ఉండేందుకు రూ.7.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. జనవరిలో టెండర్లు జరిగినప్పటికీ అప్పట్లో పనులు మొదలు కాలేదు. పూర్తిస్థాయిలో సీట్రాక్(పరుపురాయి) వచ్చింది. దాన్ని తొలగించి కొలనులాగా తయారుచేసిన అనంతరం అడ్డుగా గోడనిర్మించి దానికి జాలివేయాల్సి ఉంది. అయితే ఇక్కడ రాళ్లను తొలగించడానికి బ్లాస్టింగ్ చేయాల్సి రావడం.. ఒకపక్క ప్రధాన ఆనకట్ట.. మరో పక్క విద్యుదుత్పాదన కేంద్రం ఉండటంతో పనులు నిలిచాయి. బ్లాస్టింగ్ పెట్టి రాళ్లను తొలగించడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతులు పొందాల్సిఉంది. ఆ అనుమతులు రావడానికి ఆలస్యం కావడంతో ఇరవై రోజుల పాటు పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు అనుమతులు రావడంతో ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన డ్యాంకు దిగువన యాప్రాన్ ముందుగా ఉన్న స్పిల్‌వేకు వేసిన దారిలో బ్లాస్టింగ్ పనులు కొనసాగుతు న్నాయి. బ్లాస్టింగ్ పెట్టి ఎప్పటికప్పుడు రాళ్లను తొలగిస్తున్నారు. మరో పక్క నీటి మళ్లింపునకు కాపర్‌డ్యాం నిర్మిస్తున్నారు. ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం అవుట్లెట్కు ఎదురుగా నిర్మించే గోడకు జాలి ఏర్పాటు చేస్తారు. టెయిల్‌పాండ్ పూర్తికాగానే అక్కడ గేట్లు వేస్తే నీరు సాగర్‌డ్యాం వరకు నిలిచి ఉంటాయి. ఆ నీటిని తిరిగి జలాశయంలో తోడిపోసుకునే సమయంలో రాళ్లు, చెత్తాచెదారం రాకుండా ఉండేందుకు కొలనులాగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని కాంక్రీట్ చేస్తారు. -
ఆయకట్టు తడారుతోంది
హాలియా, న్యూస్‌లైన్: ఈ ఏడాది నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలకు ఖరీఫ్ నిండా ముంచితే రబీలోనైనా గట్టెక్కుదామని రైతులు ఆయకట్టులో వరిసాగు చేశారు. తీరా చూస్తే ఎన్ఎస్పీ అధికారులు ఆరుతడి పంటలకే నీరిస్తామని తేల్చారు. వారబంది ప్రకారం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు తడారిపోతోంది. ఎండుతున్న పొలాలు వారబందితో సాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న ఆయకట్టు ఎండిపోతోంది. ఈ ఏడాది సాగర్ జలాశయంలో పుష్కలంగా నీరున్నా ప్రభుత్వం ఆరుతడి పంటలకే నీటిని విడుదల చేస్తామని ప్రకటించింది. అయినా ఆయకట్టు రైతులు రబీలో వరిసాగు చేశారు. ప్రభుత్వం వారబంది ప్రకారం నీటిని విడుదల చేయడంతో కాల్వ చివరి భూములకు నీరందడం లేదు. ఎడమ కాల్వ కింద జిల్లాలో 4.31లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. దీనిలో ఇప్పటి వరకు 3.75ఎకరాల్లో వరినాట్లు వేశారు. వారబంది ప్రకారం ఈ కాల్వకు ఈ నెల 5నుంచి 8వరకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో అప్పుడే నాటు వేసిన పొలాలకు పుల్క దిగకపోవడంతో పాటు ముందుగా నాటు వేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పొలాలకు సరిగా నీరందక ఎండుతుంటే ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో పెరిగే ఎండలకు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటికోసం ఆందోళనలు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలాలు వారబంది విధానం వల్ల ఎండుతుండడంతో అన్నదాతలు ఆవేదనకు గురై ఆందోళనకు దిగుతున్నారు. ఎడమ కాల్వ పరిధిలో మొదటి మేజర్ రాజవరం మేజర్ కాల్వ, ఇది 10,820 కిలోమీటర్ల పొడవుంది. దీనికింద 9356.56 ఎకరాలను మొదటగా స్థిరీకరించి 156.25క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సూరేపల్లి మేజర్ కాల్వ కింద కూడా 5133.17 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 80.27 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం ఈ మేజర్ల కింద ఆయకట్టు స్థిరీకరణలో మార్పు రావడంతో ఈ నీరు చివరి పొలాలకు సరిపోక పంట ఎండిపోతోంది. దీంతో ఇటీవల హాలియా మండంలోని రాజవరం, బోయగూడెం, కొంపల్లి, వీర్లగడ్డ తండా, పుల్లారెడ్డిగూడెం గ్రామాల రైతులు వారబంది విధానం ఎత్తివేసి ఏప్రిల్ వరకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. -
ఏదీ.. లిప్ట్ ?
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన సహకార ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమవున్నాయి. కాలువ నిర్మాణ సమయంలోనే నిర్మించిన పాతకాలం షెడ్లు కూలిపోతున్నాయి. మోటార్లు కాలిపోవడంతోపాటు సెక్షన్ పైపులు మూలకు పడుతున్నాయి. దీంతో ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు రోజురోజుకూ బీడుగా మారుతోంది. కేవలం కాలువ సమీపంలో ఉన్న భూములకు తప్ప చివరి భూములకు సాగునీరందడం లేదు. మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ఎడమ కాలువపై 40 ఎత్తిపోతలు ఉన్నాయి. ఆయా పథకాల కింద 78,364 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. కానీ ప్రస్తుతం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలలో పూర్తిస్థాయిలో మోటార్లు నడవకపోవడం వల్ల సుమారు 50 శాతం ఆయకట్టు బీడుగా మారింది. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాలువ చివరి భూములకు నీరందక 40 శాతం భూమి బీడుగా మారింది. ఇటీవల మిర్యాలగూడ మండలంలోని నందిపాడు సమీపంలో ఆర్-5 ఎత్తిపోతల పథకం నీటి గుంత కూలి సెక్షన్ పైపులు విరిగిపోయిన విషయం విదితమే. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులూ చేపట్టలేదు. మరికొన్ని ఎత్తిపోతల పథకాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు కేటాయించినా పనులు చేపట్టడం లేదు. ఇవీ ప్యాకేజీలు ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలోని 10 ఎత్తిపోతల పథకాలున్నాయి. రెండవ ప్యాకేజీలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని 15 ఎత్తిపోతల పథకాలున్నాయి. మూడవ ప్యాకేజీలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని 8 ఎత్తిపోతల పథకాలున్నాయి. నాలుగో ప్యాకేజీలో మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాలలోని 6 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నిధుల కేటాయింపు ఇలా.. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆధునికీకరించడానికి సుమారు రూ.91.50 కోట్లు కేటాయించారు. వాటిలో మొదటి ప్యాకేజీలోని ఎత్తిపోతల పథకాలకు రూ.19.50 కోట్లు, రెండవ ప్యాకేజీలోని 15 ఎత్తిపోతల పథకాలకు రూ.20.70 కోట్లు, మూడవ ప్యాకేజీలోని 8 ఎత్తిపోతల పథకాలకు రూ.18.30 కోట్లు, నాలుగో ప్యాకేజీలోని 6 ఎత్తిపోతల పథకాలకు రూ.33 కోట్లు కేటాయించారు. పూర్తికాని టెండర్ల ప్రక్రియ.. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రెండు, మూడేళ్లుగా ప్రపంచ బ్యాంకు బృందం, ఏపీఐడీసీ అధికారులు అనేక పర్యాయాలు ఎత్తిపోతల పథకాలను సందర్శిస్తున్నారే కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. జిల్లాలోని 40 ఎత్తిపోతల పథకాల్లో ఎల్- 27 మినహా మిగతా 39 ఎత్తిపోతల పథకాలకు గాను రూ.91.50 కోట్ల నిధులు కేటాయించారు. కానీ మొదటి ప్యాకేజీలో మాత్రమే ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. మూడవ ప్యాకేజీలో టెండర్ల ప్రక్రియ పూర్తయినా ఇంకా అగ్రిమెంట్ కాలేదు. రెండు, నాలుగవ ప్యాకేజీలో ఇప్పటి వరకు కనీసం టెండర్లు ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.