నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన సహకార ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమవున్నాయి. కాలువ నిర్మాణ సమయంలోనే నిర్మించిన పాతకాలం షెడ్‌లు కూలిపోతున్నాయి. మోటార్లు కాలిపోవడంతోపాటు సెక్షన్ పైపులు మూలకు పడుతున్నాయి. దీంతో ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు రోజురోజుకూ బీడుగా మారుతోంది. కేవలం కాలువ సమీపంలో ఉన్న భూములకు తప్ప చివరి భూములకు సాగునీరందడం లేదు.
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ఎడమ కాలువపై 40 ఎత్తిపోతలు ఉన్నాయి. ఆయా పథకాల కింద 78,364 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. కానీ ప్రస్తుతం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలలో పూర్తిస్థాయిలో మోటార్లు నడవకపోవడం వల్ల సుమారు 50 శాతం ఆయకట్టు బీడుగా మారింది.
అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాలువ చివరి భూములకు నీరందక 40 శాతం భూమి బీడుగా మారింది. ఇటీవల మిర్యాలగూడ మండలంలోని నందిపాడు సమీపంలో ఆర్-5 ఎత్తిపోతల పథకం నీటి గుంత కూలి సెక్షన్ పైపులు విరిగిపోయిన విషయం విదితమే. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులూ చేపట్టలేదు. మరికొన్ని ఎత్తిపోతల పథకాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు కేటాయించినా పనులు చేపట్టడం లేదు.
ఇవీ ప్యాకేజీలు
ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.
మొదటి ప్యాకేజీలో హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలలోని 10 ఎత్తిపోతల పథకాలున్నాయి.
రెండవ ప్యాకేజీలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని 15 ఎత్తిపోతల పథకాలున్నాయి.
మూడవ ప్యాకేజీలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని 8 ఎత్తిపోతల పథకాలున్నాయి.
నాలుగో ప్యాకేజీలో మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాలలోని 6 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి.
నిధుల కేటాయింపు ఇలా..
నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆధునికీకరించడానికి సుమారు రూ.91.50 కోట్లు కేటాయించారు. వాటిలో మొదటి ప్యాకేజీలోని ఎత్తిపోతల పథకాలకు రూ.19.50 కోట్లు, రెండవ ప్యాకేజీలోని 15 ఎత్తిపోతల పథకాలకు రూ.20.70 కోట్లు, మూడవ ప్యాకేజీలోని 8 ఎత్తిపోతల పథకాలకు రూ.18.30 కోట్లు, నాలుగో ప్యాకేజీలోని 6 ఎత్తిపోతల పథకాలకు రూ.33 కోట్లు కేటాయించారు.
పూర్తికాని టెండర్ల ప్రక్రియ..
నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రెండు, మూడేళ్లుగా ప్రపంచ బ్యాంకు బృందం, ఏపీఐడీసీ అధికారులు అనేక పర్యాయాలు ఎత్తిపోతల పథకాలను సందర్శిస్తున్నారే కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. జిల్లాలోని 40 ఎత్తిపోతల పథకాల్లో ఎల్- 27 మినహా మిగతా 39 ఎత్తిపోతల పథకాలకు గాను రూ.91.50 కోట్ల నిధులు కేటాయించారు. కానీ మొదటి ప్యాకేజీలో మాత్రమే ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. మూడవ ప్యాకేజీలో టెండర్ల ప్రక్రియ పూర్తయినా ఇంకా అగ్రిమెంట్ కాలేదు. రెండు, నాలుగవ ప్యాకేజీలో ఇప్పటి వరకు కనీసం టెండర్లు ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.
ఏదీ.. లిప్ట్ ?
Published Mon, Feb 10 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement