సంగ్రామ సాగర్ | Sagar | Sakshi
Sakshi News home page

సంగ్రామ సాగర్

Published Sat, Feb 14 2015 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

Sagar

మాచర్ల టౌన్/విజయపురిసౌత్: నాగార్జున సాగర్ కుడికాలువకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా అడ్డగించేందుకు తెలంగాణ  ప్రభుత్వం ప్రయత్నించటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్‌అధికారులు, పోలీసులు వాదులాడుకొని ఘర్షణ పడ్డారు. నీటి విడుదలకు శుక్రవారం ఆంధ్ర ప్రభుత్వ అధికారులు గురజాల, మాచర్ల పోలీస్ రెవెన్యూ వర్గాలతో కలసి ప్రాజెక్టు పైకి వెళ్లినప్పటి నుంచి రాత్రి 8.30గంటల వరకు ఘర్షణ కొనసాగుతూనే ఉంది.
 
  తెలంగాణ  ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆంధ్ర రైతులకు నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఆదిత్యదాస్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని తీసుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు పైకి వెళ్లిన అధికారులకు పలుసార్లు అవమానాలు జరిగాయి. లింగంగుంట్ల సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కుడికాలువ ఇరిగేషన్ అధికారి కృష్ణారావు, ఈఈ జబ్బర్, ఆర్డీవో మురళి, డిఎస్పీ నాగేశ్వరావు, సీఐ చిన్న మల్లయ్యలను ఏదో విధంగా అడ్డగించి అవమానపరిచి కుడికాలువ గేటు ఎత్తకుండా తెలంగాణ  అధికారులు వ్యూహం పన్నారు.
 
  తెలంగాణ  అధికారులు సాగర్ ప్రాజెక్టుపై శుక్ర వారం ఉదయం 9గంటల నుంచే మోహరించారు. ఎవరు డ్యాం పైకి రావాలన్నా ప్రాజెక్టు ఎస్‌ఈ విజయభాస్కర్ అనుమతి తీసుకొనిరావాలని డ్యాం సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే మాచర్ల కెనాల్స్ డీఈ నజీర్ అహ్మద్ ఎస్‌ఈ కృష్ణారావులు వేర్వేరు సమయాలలో రాగా సెక్యూరిటీ వారు అడ్డగించి అవమానించారు. దీంతో వారు తమ వాహనాలలోనే అరగంటకు పైగా ఉండిపోయారు. ఆ తరువాత డ్యాం ఆర్‌ఐ భాస్కర్ అనుమతితో ప్రాజెక్టు పైకి వెళ్లారు. ఒక దశలో సాగర్ కుడికాలువ గేట్ల వద్ద కిందకు వెళ్లకుండా నీటిని విడుదల చేయనీయకుండా చేసేందుకు ఆంధ్ర అధికారులపై పోలీసులను ఉసిగొల్పారు. తెలంగాణ  పోలీసు అధికారులతో సహ సిబ్బంది ఆంధ్ర అధికారులపై ఎదురుదాడి చేసి ఘర్షణ పడ్డారు. దీనిని అడ్డగించే ప్రయత్నంలో ఉన్న ఆంధ్ర పోలీసులపై తెలంగాణ  పోలీసులు ఘర్షణ పడగా అనివార్య పరిస్థితులలో ఆంధ్ర పోలీసులు కూడా తిరగపడ్డారు. ఈ విధంగా ఐదు గంటల పాటు తెలంగాణ  అధికారులు హైడ్రామా నడిపి నీటి విడుదలను అడ్డగించటమే ధ్యేయంగా వ్యవహరించారు. ఉన్నతాధికారులు వచ్చి చర్చలు జరిపినా కుడికాలువకు నీటి విడుదల కొలిక్కి రాలేదు. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేస్తుండగా, ఎడమ కాలువకు 8 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంటున్నారు. ఈ హైడ్రామా మొత్తాన్ని తెలంగాణ  అధికారులు పెత్తనం పేరుతో నిర్వహించి ఆంధ్ర అధికారులను అన్ని రకాలుగా అవమానపర్చారు. అయినా ఆంధ్ర అధికారులు వెన్ను చూపక నీటి విడుదలకు చివరి వరకు వాదులాటకు దిగి తమ ప్రయత్నాలు కొనసాగించారు.
 
 తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన
 మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి...
 రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు తీసుకొని కుడి కాలువ రైతుల ప్రయోజనాన్ని కాపాడవల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్యను జటిలం చేయటంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని నిలుపుదల చేసే వరకు పట్టించుకోకుండా సింగపూర్, మలేషియా ఇతర దేశాలలో చక్కర్లు కొట్టి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను సీఎం చంద్రబాబు విస్మరించారన్నారు. విజయపురిసౌత్ రివర్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో చర్చించిన అనంతరం ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూడు లక్షల మంది రైతులు పంటలు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ  ప్రభుత్వం కుడికాలువకు నామమాత్రంగా నీటిని ఇవ్వటం అత్యంత దారుణమన్నారు.
 
 మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి సమస్యను జటిలం చేసే విధంగా కుడికాలువ గేట్లను పగలకొడతామని ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం తెలంగాణ  రాష్ట్రంతో చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు.  నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ  ప్రభుత్వం సహకరించి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని ఆయన కోరారు. తమ పార్టీ తరఫున రైతుల హక్కులు కాపాడేందుకు ఉద్యమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాచర్ల జెడ్‌పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తోటకూర పరమేశ్వరావు, అల్లు వెంకటరెడ్డి, నోముల కృష్ణ, బూడిద శ్రీను తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement