మాచర్ల టౌన్ : నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లలో నీటిమట్టాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. నీటి విడుదలకు సంబంధించి ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు లేఖలు రాసుకున్నా రైతులను ఆందోళన వీడడం లేదు. సాగు, తాగునీటి అవసరాలు పెరిగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రైతులు రబీసాగుపై బెంగ పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాడెల్టా కింద సాగు, తాగు నీటి కోసం అవసరమైన జలాలను విడుదల చేయాలని వారం రోజుల కిందట కోరింది. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లలో నీరు తగ్గిపోవటంతోపాటు, ఇప్పటికే అవసరాలకు తగ్గవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని ఉపయోగించుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ కుడి కాలువకు నీటిని నిలుపుదల చేయటంతో జల జగడం ఏర్పడింది. తీవ్ర వాదోపవాదాలు, ఘర్షణ అనంతరం నీటి విడుదలకు గేట్లు ఎత్తారు.
కనిష్టస్థాయికి చేరువలో
శ్రీశైలం రిజర్వాయర్
ప్రతి రోజు కుడికాలువ నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గడంతో జల విద్యుత్ కేంద్రం నుంచి నీటిని విడుదల చేయటంలేదు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎడమ కాలువకు ప్రస్తుతం 8,997 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం మొత్తం సాగర్ రిజర్వాయర్ నుంచి 14,525 క్యూసెక్కులు అవుట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు.
సాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి కేవలం 3,222 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ ఇప్పటికే 834 అడుగులకు తగ్గిపోయింది. మరో రెండు అడుగులు తగ్గితే హైకోర్టు ఆదేశాల మేరకు కనిష్ట స్థాయి అయిన 832 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగర్‌కు మరో రెండు రోజుల్లో శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో ఆగిపోనుంది.
సాగర్ నుంచి మరో 20 అడుగులు మాత్రమే...
ఇదిలా ఉండగా కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ సాగర్ నీటిని విడుదల చేస్తుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతుంది. అదే విధంగా సాగర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల అధికంగా ఉండడంతో నీటి మట్టం 529.80 అడుగులకు పడిపోయింది. శ్రీశైలం నుంచి రెండు అడుగులు, సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 అడుగులు మాత్రమే నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 510 అడుగుల వద్ద డెడ్ స్టోరేజీగా నమోదవుతుంది. అప్పటి వరకు మాత్రమే నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
చెరువులు, కుంటలు నింపాల్సిఉంది..
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండో పంటకు నీటిని కోరటం, ఇక్కడ కృష్ణా డెల్టా కింద దాళ్వాకు నీటి అవసరం ఉండడంతో పంటలు పండేవరకు నీరు వస్తుందా రాదా అని రైతులు ఆందోళనలో ఉన్నారు. కుడికాలువ పరిధిలో ప్రస్తుతం లక్ష ఎకరాల్లో మిర్చిపంట, రెండున్నర లక్షల ఎకరాల్లో మాగాణి, 50 వేల ఎకరాల్లో ఇతర పంటలకు నీటి అవసరాలు ఉన్నాయి. మరో వైపు తాగునీటి అవసరాలకు చెరువులు, కుం టలు నింపుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రబీ సాగును ఎలా కాపాడుకోవాలనీ, చివరి వరకు ప్రభుత్వం నీరు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయంగా ఏ చర్యలు చేపట్టాలని ఆలోచిస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
రిజర్వాయర్‌లలో నీటిమట్టాలు తగ్గాయి :
షేక్ జబ్బార్ , కెనాల్స్ ఈఈ
సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లలో నీటి మట్టాలు తగ్గాయి. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాగర్ కుడికాలువ పరిధిలో వేసిన పంటలకు మార్చి 31వ తే దీ వరకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ పంటలకు దశల వారిగా నీటిని విడుదల చేస్తూ, చెరువులు, కుంటలను నింపి తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నీటిని వృథా చేయకుండా వేసిన పంటలకు మాత్రమే వినియోగించుకోవాలి.
రబీ రైతు బెంగ
Published Wed, Feb 25 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement