విజయపురిసౌత్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు బహువిధ ప్రయోజనకారి అయిన నీటి మళ్లింపు మార్గం (డైవర్షన్ టన్నెల్) సుమారు 40 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురవుతోంది. మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గేటు ద్వారా నీరు కూడా వృథా అవుతోంది. నిత్యం నీరు లీకై దిగువ కృష్ణానదిలో కలుస్తోంది.
ఇలా ఏడాది పొడవునా వెళ్లే నీటితో హైదరాబాద్ వంటి నగరంలో సగ భాగానికి తాగునీరు సరఫరా చేయవచ్చని సాగునీటి శాఖ రిటైర్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. దీనిని మూసివేయడమే పరిష్కారమని నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై నాలుగు నెలల క్రితం ఓ కమిటీని వేశారు. డైవర్షన్ టన్నెల్‌ను పరిశీలించి అభిప్రాయాలను తెలియజేయాలని సాగునీటి శాఖ ఆ కమిటీని కోరింది.
గత నెలలో హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైన కమిటీ ఆ టన్నెల్‌ను మూసివేసే కోణంలో ఆలోచన చేసిన ట్లు సమాచారం. సాగర్ నిర్మాణ సమయంలో నీటిని మళ్లించడానికి దీనిని ఉపయోగించారు. డ్యాం పూర్తికాగానే వాస్తవంగా దీనిని మూసివేయాలి. కాని సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన సమయంలో క్రస్ట్‌గేట్లతో పాటు దీని గేట్లను ఎత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తే నీటితో పాటు సిల్ట్(బురద) వె ళ్లే అవకాశాలుంటాయని నిపుణులు భావించి డైవర్షన్ టన్నెల్‌ను అలానే ఉంచారు. కాని దానిగేట్లు మట్టిలో కూరుకుపోవడంతో దాని పనితీరులో మార్పు వచ్చింది.
వివిధ గేట్ల ద్వారా నీరు వెళ్లేతీరు ఇలా..
సాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడానికి నీటి మట్టాన్ని బట్టి వివిధ గేట్లను ఉపయోగిస్తుంటారు. 590 నుంచి 546 అడుగుల వరకు 26 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. 510 అడుగుల వరకు ఎడమ కాలువకు, 500 అడుగుల వరకు కుడి కాలువకు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 489 అడుగుల వరకు నీటిని విడుదల చేసే వీలుంది.
జలాశయం 489 నుంచి 400 అడుగుల నీటి మట్టానికి చేరినప్పుడు కృష్ణాడెల్టాకు తాగునీటిని అందించడానికి డ్యాంకు ఇరువైపులా ఉన్న రెండు సూట్‌గేట్లని ఉపయోగిస్తారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆంధ్రప్రాంతానికి తాగు నీటినందించడం కోసం, జలాశయం నీటిమట్టం 400 నుంచి 300 అడుగుల వరకు ఉన్నప్పుడు నీటిని వదలడానికి మళ్లింపు మార్గం (డైవర్షన్ టన్నెల్)గేటును రూపొందించారు. దీనిద్వారా నీటిని వదిలే సమయంలో సిల్ట్ వెళ్లే అవకాశాలుండేవి. ప్రధాన డ్యాంకు సీపేజీ మరమ్మతు పనులు చేపట్టాలన్నా దీనిద్వారానే నీటిని వదలాల్సి ఉంది. ఇకపై అలాంటి పరిస్థితి రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టు ఉండటంతో కనీస నీటి నిల్వలను జలాశయంలో ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రాబోయే రోజుల్లో ఎల్లప్పుడు 530 అడుగుల నీటిని సాగర్‌లో నిల్వ ఉంచాలనే డిమాండ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ టన్నెల్ మార్గాన్ని మూసివేయడమే మంచిదనీ, అవసరమైనప్పడు తెరుచుకునేలా అవకాశం ఉంచి మూసివేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో నీరు వృథా కాకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సాగర్ పై నిర్లక్ష్యం నీడ
Published Sat, Feb 28 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement