నాగార్జునసాగర్, న్యూస్‌లైన్ సాగర్ ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పాదన కేంద్రం అవుట్‌లెట్ చానల్స్‌కు 40మీటర్ల దూరంలో ట్రాష్‌రాక్ నిర్మిస్తున్నారు.సాగర్ జలాశయంలోకి నీటిని తోడేసే సమయంలో రాళ్లు, చెత్తచెదారం రాకుండా ఉండేందుకు రూ.7.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. జనవరిలో టెండర్లు జరిగినప్పటికీ అప్పట్లో పనులు మొదలు కాలేదు. పూర్తిస్థాయిలో సీట్‌రాక్(పరుపురాయి) వచ్చింది. దాన్ని తొలగించి కొలనులాగా తయారుచేసిన అనంతరం అడ్డుగా గోడనిర్మించి దానికి జాలివేయాల్సి ఉంది.
అయితే ఇక్కడ రాళ్లను తొలగించడానికి బ్లాస్టింగ్ చేయాల్సి రావడం.. ఒకపక్క ప్రధాన ఆనకట్ట.. మరో పక్క విద్యుదుత్పాదన కేంద్రం ఉండటంతో పనులు నిలిచాయి. బ్లాస్టింగ్ పెట్టి రాళ్లను తొలగించడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతులు పొందాల్సిఉంది. ఆ అనుమతులు రావడానికి ఆలస్యం కావడంతో ఇరవై రోజుల పాటు పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు అనుమతులు రావడంతో ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన డ్యాంకు దిగువన యాప్రాన్ ముందుగా ఉన్న స్పిల్‌వేకు వేసిన దారిలో బ్లాస్టింగ్ పనులు కొనసాగుతు న్నాయి. బ్లాస్టింగ్ పెట్టి ఎప్పటికప్పుడు రాళ్లను తొలగిస్తున్నారు. మరో పక్క నీటి మళ్లింపునకు కాపర్‌డ్యాం నిర్మిస్తున్నారు. ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం అవుట్‌లెట్‌కు ఎదురుగా నిర్మించే గోడకు జాలి ఏర్పాటు చేస్తారు. టెయిల్‌పాండ్ పూర్తికాగానే అక్కడ గేట్లు వేస్తే నీరు సాగర్‌డ్యాం వరకు నిలిచి ఉంటాయి. ఆ నీటిని తిరిగి జలాశయంలో తోడిపోసుకునే సమయంలో రాళ్లు, చెత్తాచెదారం రాకుండా ఉండేందుకు కొలనులాగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని కాంక్రీట్ చేస్తారు.
చకచకా ‘ట్రాష్‌రాక్’
Published Wed, Mar 5 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement