‘ఉచితా’నికి ఒడిశా దెబ్బ | Odisha in Sand | Sakshi
Sakshi News home page

‘ఉచితా’నికి ఒడిశా దెబ్బ

Published Sun, Apr 3 2016 12:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Odisha in Sand

జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదుల తీరాల్లో  బోలెడంత ఇసుక లభ్యం అవుతోంది. ఇక్కడి ఇసుకకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది.  కట్టడాల్లో ఇక్కడి ఇసుక వాడితే మన్నిక బాగుంటుందని నిర్మాణదారులకు నమ్మకం. వంశధార, నాగావళి తీరాల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 32చోట్ల ఇసుక ర్యాంపులున్నా పర్యావరణ అనుమతులున్నవి కేవలం పన్నెండే..  
 
 కొత్తూరు, భామిని పరిసర ప్రాంతాల్లో ర్యాంపులున్నా అక్కడి ఇసుకను తీసుకునేందుకు అనుమతులు రాలేదు. ఆ రెండు ప్రాంతాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం, ఇసుక తరలించేందుకు ఒడిశా ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి కావడంతో పరిసర ప్రాంత వాసులకు ఇసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
 సరిహద్దు ప్రాంతంలో కొత్తూరు మండలం కడుమ, సిరుసువాడ, భామిని మండలం సింగిడి, బిల్లమడ ప్రాంతాల్లో ఆరు నెలల క్రితమే భూగర్భజలశాఖ, నీటిపారుదలశాఖ, గ్రామీణ నీటిసరఫరా, మైనింగ్ విభాగం, స్థానిక రెవెన్యూ సిబ్బంది  రీచ్‌ల్ని పరిశీలించాయి. పర్యావరణ అనుమతుల కోసం లేఖ రాశారు. కడుమలో 84వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకు అందుబాట్లో ఉందని, సిరుసువాడలో 1లక్షా20వేల క్యూ.మీ, సింగిడి, బిల్లమడ రీచ్‌లో 50వేల 400ల క్యూ.మీ చొప్పున ఇసుక (మొత్తం సుమారు 3లక్షల 5వేల క్యూ.మీ) అందుబాట్లో ఉన్నట్టు అధికారులు నివేదించారు. ఇందుకోసం పర్యావరణ గనుల ప్రణాళిక తయారు చేసి జిల్లా, కేంద్ర కమిటీలకు పంపించారు.
 
 ఈసీ (పర్యావరణ అనుమతులు) కావాలంటే నిబంధనల మేరకు, వివిధ విభాగాల సిబ్బంది ఇచ్చిన నివేదికల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టరే మంజూరు చేసేయొచ్చు. కానీ కడుమ, సిరుసువాడ, సింగిడి, బిల్లమడ ప్రాంతాలు ఒడిశాను ఆనుకుని 5కి.మీ లోపు ఉండడంతో ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతితోపాటు ఒడిశాలోని గజపతి జిల్లా క లెక్టర్ అనుమతి కూడా తప్పనిసరి అయ్యింది. దీంతో స్థానిక అధికారులు ఇదే విషయాన్ని ఇక్కడి కలెక్టర్ దృష్టికి వెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి నివేదికలపై స్వయంగా సంతకం చేసి ఒడిశా కలెక్టర్‌కు లేఖలు పంపించాలని విభాగాధిపతుల్ని కోరారు. ఇది జరిగి ఆరునెలలయింది. ఇప్పటికీ ఫలితం రాలేదు. ఒడిశా అధికారులు ఈ విషయమై మౌనం దాల్చడం ఇబ్బంది అవుతోంది. జిల్లా వ్యాప్తంగా కేవలం ఈ నాలుగు రీచ్‌లకే ఒడిశా అనుమతి కావాల్సి రావడం, కలెక్టరే రంగంలోకి దిగి నివేదికలు పంపించడంతో స్థానికులు ఇసుక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ అధికారులు కూడా ఈసీ కోసం ఒడిశా నుంచి ఎంత తొందరగా నివేదిక వస్తే అంత వేగిరంగా సిగ్నల్ ఇచ్చేస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది.
 
 ఏం జరుగుతోంది?
 గతంలో ఇసుకను బంగారంగా చూసిన రోజుల్లో టీడీపీ నాయకులు కొంతమంది అక్రమాలకు పాల్పడి ఎలాంటి అనుమతులు లేకుండానే ఒడిశా నుంచి ఇసుక తెచ్చేశారు. భారీగా ఇక్కడ అమ్ముకున్నారు. ఒడిశా తీరం నుంచి ఇసుక తేవాలంటే సవాలక్ష నిబంధనలు. వాటన్నింటినీ కాదని ఇసుక తెచ్చేయడంపై అక్కడి అధికారులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడిదే అంశం కొత్తూరు, భామిని మండలాల ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వడంపై ప్రభావం చూపించిందని తెలిసింది. ఇసుక రవాణాలో భారీగా సొమ్ము చేజిక్కించుకున్న నాయకులు ఒడిశా పేరునూ అక్రమంగా వాడుకున్నట్టు తెలిసింది.
 
  ఎల్‌ఎన్‌పేట, హిరమండలం పరిధిలో కొన్ని లారీల్ని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడే ఒడిశా ఇసుక ఇక్కడకు అక్రమంగా తీసుకువచ్చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆంధ్రకు ఇవ్వాల్సిన అనుమతులపై గజపతి జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలిసింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నెలరోజుల నుంచి అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం..ఇక్కడి వారు మాత్రం తమ కళ్లముందే భారీగా ఇసుక కనిపిస్తున్నా తెచ్చుకోలేని పరిస్థితి. ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం వాసులు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే జలుమూరు సమీపంలో ఏర్పాటైన మూడు రేవుల నుంచే ఇసుక తెచ్చుకోవాలి. 15కి.మీ మేర వంశధార తీరం ఉన్నా ఎల్‌ఎన్‌పేట వాసులు అక్కడి ఇసుక తెచ్చుకునేందుకు అనుమతుల్లేవు.
 
 చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు కూడా ఆయా రేవుల వద్ద హెచ్చరిక బోర్డులు తగిలించారు. కాలుష్యనియంత్రణ విభాగ అధికారులు అనుమతులిచ్చిన కొన్ని చోట్లా ఇసుక దొరకడం లేదు. ఆకులతంపర పరిధిలో 45టన్నులు క్యూబిక్‌మీటర్ ఇసుక తవ్వేయడంతో ఆ ప్రాంతంలోనూ ఇసుక కొరత అధికంగా ఉంది. ఇసుక అనుమతుల కోసం తాము కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నామని అసిస్టెంట్ జియాలజిస్ట్ హనుమంతరావు సాక్షికి చెప్పారు. ఆరునెలల నుంచి ఒడిశా అధికారుల నుంచి అనుమతి కోసం చూస్తున్నామని, కలెక్టర్ లేఖ రాశారని, అంతర్‌రాష్ట్ర సమస్య కావడంతో ఇబ్బంది అవుతోందని, త్వరలోనే అనుమతులు రావచ్చని స్పష్టం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement