శిశు సంరక్షణ కేంద్రాలతో మంచి ఫలితాలు
రెండు వారాల్లో సంపూర్ణ ఆరోగ్యం
రోజుకు రూ. 100 నగదు పంపిణీ
183 మంది చిన్నారులకు మేలు
పాడేరు, న్యూస్‌లైన్ :
అనారోగ్యం, అవిద్య, అవగాహన లోపం.. మన్యాన్ని వెంటాడుతున్న సమస్యలకు మూలకారణాలివి. ఈ మూడు కారణాల వల్ల మన్యంలో ప్రధానంగా శిశు మరణాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. తల్లులను వెంటాడుతున్న పౌష్టికాహార లోపం, రుగ్మతలు శిశువులకు వ్యాధుల రూపంలో ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే అవగాహనలోపంతో చిన్నారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ సమస్యల నివారణకు ఏజెన్సీలో ఏర్పాటైన పౌష్టికాహార పునరావాస, శిశు సంరక్షణ కేంద్రాలు ఎంతో మేలు చేస్తున్నాయి. పాడేరులో ఏర్పాటైన ఈ కేంద్రాల వల్ల స్వల్పకాలంలో అత్యుత్తమ ఫలితాలు చేకూరుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహర సమస్యతో బలహీనంగా ఉంటే ఈ కేంద్రాలలో చేరిన కొద్ది రోజులకే ఆరోగ్య వంతులవుతున్నారు. పుట్టిన శిశువులు అనారోగ్యంతో సతమతమవుతూ ఉంటే ఉన్నత స్థాయి వైద్యసేవలు కల్పించి ప్రాణాలను కాపాడుతున్నారు. తమ బిడ్డలను ఈ కేంద్రాలలో ఉంచిన తల్లులు ఉపాధి కోల్పోకుండా వారికి రోజుకు రూ. 100 వంతున ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు.
సత్వరమే ఆరోగ్యం
పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో 2012 డిసెంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ పౌష్టికాహర పునరావాస, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పౌష్టికాహర లోపంతో బక్కచిక్కిన బిడ్డలను కాపాడుకోవాలనే తాపత్రాయంతో అనేక మంది తల్లులు ఈ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఇప్పటికి 183 మంది చిన్నారులు పౌష్టికాహర పునరావాస కేంద్రం కారణంగా ఆరోగ్యవంతులయ్యారు. పునరావాస కేంద్రాల్లో చేరిన మొదటి రోజు నుంచే చిన్నారులకు నాణ్యమైన ఆహరాన్ని ఆందిస్తున్నారు. చిన్న పిల్లల వైద్యనిపుణుడు, న్యూట్రిషన్ అధికారి సమక్షంలో ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తున్నారు. వివిధ ఆహార పదార్ధాలతో చేసిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దాంతో కేవలం రెండు వారాల వ్యవధిలో శిశువులు పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులవుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వారి ప్రాణాలు కాపాడడానికి ఫోటోథెరపీ,ఆటోమేటిక్ వార్మర్స్,ఆక్సిజన్ మోనటరింగ్ వంటి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఇలా ఇప్పటికి 107 మంది శిశువుల ప్రాణాలను కాపాడారు. అత్యవసర పరిస్థితులలో విశాఖపట్నంలోని చిన్నపిల్లల వైద్యనిపుణుల వద్దకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు.
ఉన్నతస్థాయి సౌకర్యాలు
పౌష్టికాహర పునరావాస, శిశుసంరక్షణ కేంద్రాలలో ఉన్నత స్థాయి వైద్య సేవలు కల్పిస్తున్నాం.14 రోజులలో శిశువులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దుతున్నాం.
- డాక్టర్ వి.శ్రీనివాసరావు, చిన్నపిల్లల వైద్యనిపుణులు, పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి.
గిరిజన చిన్నారులకు వరం
Published Wed, Feb 12 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement