
అంగుళూరు గ్రామంపై అధికారుల కర్కశం
పోలవరం నిర్వాసిత గ్రామం అంగుళూరుపై అధికారులు కర్కశంగా వ్యవహరించారు.
నిర్దాక్షిణ్యంగా పోలవరం నిర్వాసితుల ఇళ్లు కూల్చివేత
దేవీపట్నం (తూర్పుగోదావరి): పోలవరం నిర్వాసిత గ్రామం అంగుళూరుపై అధికారులు కర్కశంగా వ్యవహరించారు. పచ్చని చెట్లతో కళకళలాడే పల్లెను పది నిమిషాల్లో మరుభూమిగా మార్చేశారు. మంగళవారం ఉదయం రంపచోడవరం ఆర్డీవో సత్యవాణి ఆదేశాల మేరకు అధికారులు పోలీసు బలగాలతో అంగుళూరులో బీభత్సం సృష్టించారు. భారీ యంత్రాలతో ఇళ్లను కూల్చివేశారు. పిల్లలు, వృద్ధులు అని చూడకుండా లాగిపడేశారు. దీంతో నిరుపేదలు భయంతో వణికిపోయారు.
రెవెన్యూ, పోలీసు బలగాలు తెల్లవారుజామునే సమీప కాలనీల గిరిజనులను కదలనివ్వకుండా నిర్బంధించారు. ముంపు గ్రామంలో నివసిస్తున్న 24 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ ఘటనతో హతాశులైన మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. నిర్వాసితులకు అందజేయాల్సిన ప్యాకేజీ ఇవ్వకుండా, భూమికి భూమి పరిహారం అందించకుండా అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.