కాటసాని నిధులతో నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్‌ను అడ్డుకోవడంతో నిలిచిన పనులు
సాక్షి, సంజామల(కర్నూల్): మండలంలోని బొందలదిన్నె గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నేతలకు వత్తాసు పాలుకుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు గ్రామంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా ఉంది. వివరాలు.. గ్రామంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆరునెలల క్రితం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.
అయితే దాన్ని జీర్ణించుకోలేని అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. మంచి పనిని స్వాగతించాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ నేతకు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలంలో కడుతున్న ప్లాంట్‌ను అడ్డుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పనిని అడ్డుకున్న టీడీపీ నేతలు, అధికారులు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా స్థలంలో దౌర్జన్యంగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు.
పట్టా స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్
బాధితులు తమ స్థలంలో ప్లాంట్ కట్టొద్దని మొత్తుకున్నా పోలీసుల అండతో అక్రమంగా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే చివరికి బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్లాంట్ నిర్మాణ పనులను ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సంబందిత అధికారులకు కోర్టు ఉత్వర్వుల కాపీలు కూడా అందాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అధికారపార్టీ నేతలు, అధికారుల తీరుతో రెండు వర్గాల మధ్య గొడవలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ప్యాక్షన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన గ్రామంలో గత పదిహేనేళ్లుగా ప్యాక్షన్ తగ్గుముఖం పట్టి గ్రామ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ రూపంలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలతో గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగేలా మారింది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మా స్థలంలో నిర్మిస్తున్నారు
గ్రామంలోని సర్వే నంబర్ 83లో మాకు 2.8 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించిన రిజిస్టర్ డ్యాకుమెంట్లు కూడా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు నా స్థలంలో దౌర్జన్యంగా వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంతో నేను హైకోర్టును ఆశ్రయించాను. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు.
– రమణారెడ్డి, బొందలదిన్నె
‘అధికార’ అండతో దౌర్జన్యం
అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు దౌర్యన్యానికి పాల్పడుతుండగా అధికారలు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చుపెట్టాలని చూడటం తగదు. గ్రామంలో గొడవలు జరిగితే అధికారులదే బాధ్యత.
– వెంకటస్వామి, బొందలదిన్నె
Comments
Please login to add a commentAdd a comment