కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇష్టారాజ్యంగా నడుస్తున్న అనుమతి లేని ఫైనాన్స్‌లపై అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హుజూరాబాద్‌లో దాడులు పేరిట హడావుడి చేస్తున్న పోలీసులు.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫైనాన్స్‌ల వైపు కన్నెత్తిచూడకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లాలో వెయ్యికిపైగా అనుమతి లేని ఫైనాన్స్‌లు నడుస్తున్నాయని సమాచారం. ఇలాంటివి ఒక్క కరీంనగర్‌లోనే సుమారు నాలుగు వందలున్నాయని అంచనా. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో మరో ఎనిమిది వందల వరకు ఉన్న ఫైనాన్స్‌లలో యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఫైనాన్స్‌లో ప్రతిరోజు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు వ్యాపారం సాగుతోంది. కరీంనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లోని ఫైనాన్స్‌లలో కొందరు పోలీసులు పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలున్నాయి. వీరు తెరవెనుక ఉండి ఫైనాన్స్ దందాతోపాటు రియల్ వ్యాపారం నడిపిస్తున్నారని సమాచారం.
అక్రమ వ్యాపారం చేస్తున్న ఫైనాన్షియర్లు అవసరాల కోసం వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలను, చిరువ్యాపారులను దోచుకుంటున్నారు. అత్యవసరంగా అప్పులు తీసుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఏటీఎం కార్డులు, చెక్కులు, జామీనులు పెట్టుకొని రూ.వందకు రూ.7 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. తమ వద్ద అనధికారికంగా నడిచే చిట్టీల్లో బలవంతంగా చేర్పిస్తున్నారు. అప్పు తీర్చిన తర్వాత తమ వద్ద పెట్టుకున్న కాగితాలు, చెక్కులు తిరిగిచ్చేందుకు కూడా రూ.ఐదారువేలు గుంజుతున్నారు. సకాలంలో అప్పు తీర్చలేని వారి ఇళ్ల నుంచి వస్తుసామగ్రి తీసుకున్న సంఘటనలు సైతం లేకపోలేదు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనుకుని లోలోపలే కుమిలిపోతున్న వారు ఎందరో ఉన్నారు.
గతంలో కరీంనగర్‌లో పనిచేసిన ఓ సీఐ నిత్యం అక్రమ ఫైనాన్స్‌దారులతో సోలీస్‌స్టేషన్లోనే మంతనాలు నిర్వహించేవారు. దీంతో పోలీసులకు, అక్రమ ఫైనాన్షియర్లకు ఉన్న లింకు తెలుస్తోంది. ఇలా పలుచోట్ల పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు అనుమతి లేని ఫైనాన్స్‌లలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే తమ సంస్థల వైపు కన్నెత్తిచూడకుండా పోలీసులు, రాజకీయ వర్గాల ద్వారా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరమెంతైనా ఉంది.
కదలరు.. మెదలరు
Published Fri, Nov 15 2013 3:03 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement