
నాలుకతో ఆరడుగుల మానవ దేహం ఇలా ప్రాధేయపడిందట...నరం లేని ఓ నాలుకా హద్దులు దాటొ ద్దు... నీ దురుసుతనం వల్లనే చెడ్డపేరు వస్తోంది. లోలోపలుండి... ఎవరికీ కనిపించకుండా... ఇష్టం వచ్చి నట్టు నాలుక తిప్పడం కారణంగా ‘నో టి దురుసుతనమంటూ, విచక్షణా ఞా్ఞనం లేదంటూ’ ఎదుటివాళ్లు అసహ్యించుకుంటూ దూరమవుతున్నారు. నోట్లోని భాగాలు మరో అడుగు ముందుకువేసి ‘నీవేదో వాగితే పళ్లు రాలిపోతాయంటూ, గూబ గుయ్యిమంటుం’దంటూ ముందుగా మాపై మండిపడుతున్నారని వాపోయాయి. మాట తూలితే వచ్చే కష్టాలపై వ్యంగ్య ఛమక్కు ఇదీ. ఈ జిల్లాలో ఉ న్నతంగా అధి కారం వెలగబెడుతున్నఓ అధికారి నాలుకకు కూడా అసభ్యకర దూషణలు అలవోకగా వ చ్చేస్తుంటాయి. ఎదురుగా ఉన్నవారు కూడా ఉ న్నతాధికారులనే విచక్షణ లేకుండా తిట్ల దండ కం దండుకోవడంపై మండిపడుతున్నారు. ‘నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతు’ందనే నానుడి ఆ దొరగారికి తెలుసో లేదో మరి...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని ఓ ఉన్నతాధికారి నోటి దురుసుతనంపై అధికారులు గుర్రుగా ఉన్నారు. అవమాన భారంతో రగిలిపోతున్నారు. సమీక్షా సమావేశాల్లో ఆయన అనుసరిస్తున్న తీరు వివాదస్పదంగా మారుతోంది. విసిగి వేసారిన కొందరు అధికారులు ప్రభుత్వంలోని కీలక మంత్రి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. కాకపోతే ఆ ఉన్నతాధికారికి సదరు మంత్రి అండదండలు దండిగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో అధికారులు కక్కలేక మింగలేక సతమతవుతున్నారు. భరించలేక కొందరు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతుండగా మరికొందరు ‘ఈయన ఎప్పుడు వెళ్లిపోతాడా’ అని ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు తప్పదని బాధను దిగమింగుకుంటూ పనిచేస్తున్నారు.
అన్నీ తానై ఓవర్ యాక్షన్...
జిల్లా ఉన్నతాధికారి వైఖరి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలా జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కీలక మంత్రితో ‘సాన్నిహిత్యం’ ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఇక్కడ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను సహితం లెక్క చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఆయన జిల్లాకు వస్తే చాలు కార్యకర్తకన్నా అధ్వానంగా ప్రవర్తిస్తుండడం ఆ పార్టీలోనివారికే అసహ్యమనిపిస్తోంది. సదరు మంత్రి కారు డోర్ వద్ద నిలబడి కిందస్థాయి సిబ్బందిలా వ్యవహరిస్తారు. ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లి కూడా తనకున్న స్వామి భక్తిని ప్రదర్శిస్తుంటారు.
అసభ్యకరమైన దూషణలతో...
సమీక్షల సమయంలో ఆ ఉన్నతాధికారి అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉంటోందని ఉద్యోగ బాధితులు ‘సాక్షి’ ముందు వాపోతున్నారు. వయస్సును, హోదాను చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మహిళా అధికారులని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడం విమర్శలకు దారితీస్తోంది. బజారులో తిరిగే వ్యక్తిలా ఏమిటా మాటలంటూ మండిపడుతున్నారు. ఈ అధికారి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరవుతున్నా వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయన వద్దకు వెళ్లాలంటేనే అధికారులు భయపడుతున్నారు. పాలనాపరమైన వ్యవహారాల్లో చిన్నపాటి తప్పిదాలు చోటుచేసుకుంటే హెచ్చరించడం మంచిదే...అప్పటికీ మార్పురాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ ఇష్టారీతిన మాట్లాడితే ఎలా అని కొద్డి రోజుల్లో ఉద్యోగ విరమణ చేసే ఓ ఉద్యోగి వాపోవడం గమనార్హం. ఎన్నాళ్లిలా...ఏదో ఓ రోజు నిలదీయకపోతే ఇంకా రెచ్చిపోతుంటారని ఆయా ఉద్యోగ సంఘాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికిప్పుడైతే మేం బయటపడాం...కానీ ఏదో ఓ రోజు బద్దలవకతప్పదని...ఆ రోజు దగ్గరలోనే ఉందని కొంతమంది ఉద్యోగులు ‘సాక్షి’ ముందు తమ మనసులోని మాట చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment