వెలుగు చూసిన పురాతన ఆలయం | Old Temple Found In Chittoor | Sakshi
Sakshi News home page

వెలుగు చూసిన పురాతన ఆలయం

Published Wed, Aug 21 2019 7:57 AM | Last Updated on Wed, Aug 21 2019 8:00 AM

Old Temple Found In Chittoor - Sakshi

వీరగల్‌ శిలా శాసనం, స్తంభంపై చెక్కిన విష్ణు నామాలు 

బి.కొత్తకోట మండలం ఒకప్పుడు వైడుంబ సామంత రాజ్యంలో ఉండేదా..? తర్వాత పల్లవులు, విజయనగర రాజుల పాలనలో సాగిందా..? శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం ప్రాంతంలో సోమవారం వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. అందులో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగుచూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో మూడు రాజ్యాల పాలన సాగిందని కన్పిస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు.

సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : మండలంలోని శీలంవారిపల్లె సమీపంలోని పొలంలో ఆలయ శిథిలాలు లభ్యమైన ప్రాంతం ఒకప్పుడు కోనాపురం గ్రామంగా విరాజిల్లింది. ఇప్పటికీ ఇక్కడి వారు ఈ ప్రాంతంగా కోనాపురంగానే పిలుచుకుంటున్నారు. ఆలయం, దాని పరిసరాల్లో నివాసాలతో నిండి ఉండేదని తెలుస్తోంది. దీనికి దగ్గర్లోని చిటికివారిపల్లె ఆలయం శిథిలం తర్వాత ఏర్పడినట్టుగా చెబుతున్నారు. నివాసాలకు సంబం ధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది నుంచి 13వ శతాబ్దం వరకు చిత్తూరు జిల్లా వైడుంబి సామంతరాజుల పాలనలో ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు పశ్చిమ చాణుక్యులకు సామంతులుగా కూడా పనిచేశారు. వీరికి రాష్ట్ర కూటులు, బాణులు, నలంబ పల్లవులు సమకాలికులు.

వీరు పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కర్ణా్ణటకలోని కోలా రును రాజధానులుగా చేసుకుని పాలన సాగించారు. వీరి కాలంలో వేసిన శిలా శాసనం ఒకటి ఆల య శిథిలాలకు సమీపంలోని పొలంలో ఉం డడం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒక వీరుడు స్వర్గస్తుడై స్వర్గానికి చేరినట్టుగా చెక్కారు. అతనే కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో విల్లు కలిగి ఉన్నాడు. ఇతను సాహసవంతుడు అని తెలిపేలా కింద గుర్రం, దానిపైన రెండు నాగుపాము పడగలు ఉన్నాయి. అతని విల్లుకు ఎదురుగా ముగ్గరు ఉన్నట్టు శిల్పం చెక్కారు. వీటిపైన తెలుగు–కన్నడ భాషలా కనిపించే అక్షరాలు లిఖించి ఉన్నాయి. ఈ శాసనాన్ని వీరగల్‌ శాసనంగా పేర్కొంటున్నారు. ఇతను శత్రువులను తదముట్టించి వారి చేతిలో చనిపోగా, అతన్ని వీరుడిగా చిత్రీకరిస్తూ వేసిన శిలాశాసనాన్ని బట్టి అది వైడుంబ రాజులు వేయించినట్టుగా నిర్ధారణ అవుతోంది. వైడుంబి పాలనలోనే వీరులు ఎక్కువగా ఉండేవారు కావడంతో వీరి శిలాశాసనం ద్వారా నిర్ధారణ అయ్యింది. వీరి సామంత పాలనకు సాక్ష్యంగా పురాతన సున్నం తో తయారైన శిలకు చెందిన శిరస్సు లభ్యమైం ది. సున్నంతో శిలల తయారీ వీరి కాలం నాటిదే అని పురావస్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

పల్లవ, విజయనగర రాజ్యాల్లో..
ఈ ప్రాంతాన్ని క్రీ.శ 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పల్లవులు, క్రీ.శ 1336 నుం చి 1646 వరకు విజయనగర రాజులు పాలిం చారని తెలుస్తోంది. ఆలయ శిథిలాల్లోని శిల్పాలు, వాటిపై చెక్కిన శిల్పకళ, వన్యప్రాణులు, దేవతా విగ్రహాలు, నామాలు పరిశీలిస్తే పల్లవులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆల యం విరాజల్లినట్టుగా కనిపిస్తుంది. స్తంభాలపై సింహాల చిత్రాల శైలి  పల్లవుల కాలం నుంచి  ఉంది. కానీ విజయనగర పాలనలోనూ ఇలాగే కనిపిస్తాయి. స్తంభాలను మోస్తున్న భారవాహకుడు, యక్షుడు ఈ రాతి స్తంభాలకు పునాదులు గా కనిపిస్తారు. మకరం (మొసలి), సింహాల గుర్తులు పల్లవుల రాజ్య శైలి అయినప్పటికీ విజయనగర పాలనలో మకరం గుర్తులు కనిపిస్తాయి. ఇలాంటి గుర్తులే ములకలచెరువు మం డలంలోని సొంపాళ్యంలోని చెన్నకేశవాలయంలో కనిపిస్తాయి. వాటి పోలికలు శిథిలాల్లోని శిల్ప కళలో  కనిపిస్తుండగా, ఆలయం విజయనగర పాలనకు ముందే నిర్మాణమైనట్టుగా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 

ఆధారాలను బట్టి విష్ణు ఆలయమే 
శీలంవారిపల్లె సమీప పొలాల్లో లభ్యమైన శిథిలాలు, మహలక్ష్మి విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది కచ్చితంగా విష్ణు ఆలయమే అన్న అభిప్రాయం ఉంది. పురావస్తుశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. లభించిన పానవట్టం, శిథిలాల్లో కనిపిస్తున్న నిర్మాణ ఆకా రాలు, స్తంభాల ఆధారం, వాటిపై చెక్కిన శం ఖు, చక్రాలతో విష్ణు ఆలయంగా నిర్ధారణ అవుతోంది. పేరు ఏదైనా వైష్ణవ ఆలయం కచ్చితమని స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిథిలాల్లో విష్ణువు, గరుడుడు తదితర విగ్రహాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా ఆలయాన్ని మూడెంచెల పద్ధతిలో నిర్మించినట్టు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కోటలాంటి కట్టడం కనిపిస్తుంది. తర్వాత రెండో అంచెలో మైదానం, మూడో అంచెలో గర్భగుడి నిర్మాణం జరిగినట్టుంది. ఇప్పడు కనిపిస్తున్న శిథిలాలే గర్భగుడిగా నిర్ధారణ అయ్యింది. 

మహాలక్ష్మి విగ్రహానికి విశిష్ట ప్రత్యేకలు 
లభ్యమైన మహాలక్ష్మి విగ్రహానికి ఎన్నో విశిష్ట ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం అరుదైనదిని భావిస్తున్నారు. విగ్రహానికి నాలుగు చేతులున్నాయి. పైనున్న రెండు చేతుల్లో తామర పూలు ఉండగా, ఎడమ చేయి వరద హస్తం, కుడిచేయి అభయహస్తం కలిగి ఉన్నా యి. నుదుట మూడు నామాలు, శరీరంపై జం ద్యం ఉన్నాయి. అరచేతులు, కాళ్లకు రేఖలు కనిపిస్తున్నాయి. సుఖ ఆసనంలో ఉన్నట్టు కనిపిస్తున్న విగ్రహం మెడలో గొలుసు, ఇరువైపులా చెవులకు చక్రాలు, తలపై విష్ణువు ధరించే కిరీ టం కనిపిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా శిల్పం చెక్కిన తీరు అద్భుతం. సాధారణంగా శిల్పం ముందుభాగంలోనే విగ్రహం తయారవుతుంది. ఈ విగ్రహానికి ముందు, వెనుక రెండు వైపులా శిల్పాన్ని తయారు చేశారు. ఒకవైపే కాకుండా ముందు, వెనుక వైపు శరీర ఆకృతి ఉండడం విశేషం. 

పోలీస్‌స్టేషన్‌లో శ్రీమహాలక్ష్మి
పాపం దేవుళ్లకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక తప్పలేదు. శీలంవారిపల్లె సమీపంలోని కోనాపు రం పొలంలో సోమవారం శ్రీమహాలక్ష్మి విగ్రహం బయల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్‌ సుబ్బన్న, ఎస్‌ఐ సుమన్‌ పరిశీలిం చి వివరాలు నమోదు చేశారు. శ్రీమహాలక్ష్మి విగ్రహాన్ని  ఎస్‌ఐకి తహసీల్దార్‌  అప్పగించారు. ఎస్‌ఐ సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గదిలో నేలపై వస్త్రాన్ని పరచి విగ్రహాన్ని పడుకోబెట్టారు. ఆలయంలో ఉండాల్సిన శ్రీమహాలక్ష్మి ఇలా పోలీస్‌స్టేషన్‌ చేరుకుంది. విగ్రహాన్ని తమకు అప్పగించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఇవ్వడానికి కుదరదని స్పష్టంచేసి తీసుకొచ్చారు. మంగళవారం మళ్లీ అధికారుల వద్దకు వెళ్లిన గ్రామస్తులు రాతి విగ్రహం ఇస్తే పూజలు చేసుకుంటామని, తమ సంరక్షణలో ఆలయంలో ఉంచుతామని పట్టుబట్టారు. దీనిపై విగ్రహం అప్పగించేందుకు తహసీల్దార్‌ సుబ్బన్న అంగీకరించారు. విగ్రహాన్ని అప్పగించనున్నట్టు ఆయన  తెలిపారు.

లిపిని శోధించాలి
వీరగల్‌ శిలాశాసనంలోని లిపిని శోధిస్తే ఆలయ చారి త్రక ఆధారాలు లభ్యమవుతాయి. ఈ లిపి తెలుగు–కన్నడ భాష కనిపిస్తోంది. ఆలయ ప్రాం గణం, లభించిన మహాలక్ష్మి విగ్రహాన్ని పరి శీలిస్తే అది కచ్చితంగా విష్టు ఆలయమే. అయితే చెన్నకేశవ, నరసింహ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఒకటి కావొచ్చు. ఇది శిలలు, వాటిపై చెక్కిన బొమ్మలను పరి శీలిస్తే పల్లవరాజుల శైలి, విజయనగర రాజు ల చిహ్నలు ఉన్నాయి. దీన్నిబట్టి శిథిలాల్లో ఇంకా శాసనాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా లభించవచ్చు. ఆలయ చరిత్ర వెలుగులోకి తీసుకురావడానికి కృషిజరగాలి.
– విజయకుమార్‌, రిటైర్డ్‌ డెప్యూటీ డైరెక్టర్, పురావస్తుశాఖ 

ఆలయ విగ్రహాల తరలింపు
శిథిలాలున్న ప్రాంతంలో కోనాపురం గ్రామంగా ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. ఆలయానికి చెందిన ధ్వజస్తంభం, బలిపీఠాన్ని బి.కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు అమరనారాయణపురం ఆలయంలో ప్రతి ష్ఠించారు. కొన్నింటిని తిరుమల, తెట్టు వేణుగోపాలస్వామి, గట్టులోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయాలకు తరలించినట్టు చెప్పేవారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన కొన్నిపేర్లు  వాడుకలో ఉన్నాయి. వాయిద్యాకారులకు ఇచ్చిన భూమి ప్రాం తాన్ని మేళ్లచెరువుగా, పూలను తెచ్చేవారి కోసం నిర్మించిన ప్రాంతాన్ని పూలచెట్ల బావిగా, ఉత్సవాల కోసం పేరుమాళ్లబండ పేర్లతో పిలుచుకునే ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. 
– శీలం వేణుగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్, శీలంవారిపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

శ్రీమహాలక్ష్మి విగ్రహం

2
2/3

ఆలయం చుట్టూ కోట లాంటి ప్రహరీగోడ 

3
3/3

శిధిలాల్లో లభించిన విగ్రహం శిరస్సు  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement