
విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ పడకేసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ బాజాతో విసిగిపోయిన ప్రజలు దీన్ని దూరం పెట్టడంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. తమ ప్రచారానికి అంతగా ఉపయోగపడలేదన్న దుగ్దతో ప్రభుత్వం దానిపై శీతకన్నేసింది. ఎన్నికలకు ముందు అధికారుల్ని ఊదరగొట్టి ప్రజలకు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను ప్రభుత్వం అంటగట్టింది. ఇపుడు దానికి కావాల్సిన మెటీరియల్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం సాధ్యం కావడంలేదని ఆపరేటర్లు చెబుతున్నారు.
మూడు నెలలుగా ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు నిల్
ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆప్టికల్ లైన్ టెర్మినల్ (ఓఎల్టీ) బాక్స్‌లు, పాన్ బాక్స్‌లు అవసరం. ఒక ఓఎల్టీకి ఎనిమిది పాన్‌లు ఉంటాయి. ఒక్కొక్క పాన్ నుంచి 125 కనెక్షన్లు ఇవ్వవచ్చు. అంటే ఒక ఓఎల్టీ ఉంటే సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. రూ.2.5 లక్షలు చెల్లిస్తే ప్రభుత్వమే ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు సరఫరా చేస్తుంది. వీటి కోసం ఆపరేటర్లు డబ్బులు చెల్లించినా అధికారులు బాక్స్‌లు ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా ఓఎల్టీ బాక్స్‌ల సరఫరాను ప్రభుత్వం ఆపివేసింది. ఫైబర్ నెట్ నిధుల్ని పసుపు–కుంకుమ కోసం వినియోగించడంతో నిధులు లేక వాటిని కొనుగోలు చేయడం లేదని సమాచారం.
లంచాలు ఇస్తేనే బాక్స్‌లు
గ్రామీణ ప్రాంతాల్లో రూ.125, నగరాల్లో రూ.235 చెల్లిస్తే ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్ ఇస్తున్నారు. వీటి ద్వారా వినియోగదారుడు టీవీ, ఇంటర్ నెట్ సదుపాయం పొందొచ్చు. ఇవి కల్పించాలంటే ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు కావాలి. ముడుపులు ఇవ్వందే అధికారులు వాటిని ఇవ్వడం లేదు. ఒక్కో ఓఎల్టీ, పాన్ బాక్స్‌లకు రూ.50 వేల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆపరేటర్లు అవసరమైన బాక్సులను సమకూర్చలేకపోతున్నారు.
ప్రభుత్వ ప్రచారం రోతతో కనెక్షన్లు రద్దు చేసుకున్న ప్రజలు...
ఎన్నికల ముందు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రజలు భయపడ్డారు. అందులో ఎక్కువగా ప్రభుత్వం గురించి ప్రచారం జరుగుతూ ఉండటంతో రోతపుట్టి ఎక్కువ మంది ప్రజలు ఫైబర్ నెట్ కనెక్షన్లు రద్దుచేసుకున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత వారిలో ఎక్కువమంది కావాలంటున్నారని ఒక కేబుల్ ఆపరేటర్ ‘సాక్షి’ కి తెలిపారు. ఫైబర్ నెట్ ఎన్నికల సమయంలో తమకు పూర్తిగా ఉపయోగపడలేదని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మెటీరియల్ సరఫరాను నిలిపివేసిందని అంటున్నారు.