వచ్చే డిసెంబర్ 6న కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నాయని,
కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జస్టిస్ నర్సింహారెడ్డి
హైదరాబాద్: వచ్చే డిసెంబర్ 6న కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నాయని, ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. హైకోర్టులో శుక్రవారం విలేకరులతో జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,357 కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 14,605 కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతో ప్రజలు చిన్న చిన్న సమస్యలకు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు తక్షణ పరిష్కారంగా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇరు రాష్ట్రాల్లోని కింది కోర్టుల్లో దాదాపు 10 లక్షల వరకు పెండింగ్ కేసులున్నాయని తెలిపారు. కాగా డిసెంబర్ 6న తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ శుక్రవారం అన్ని రాష్ట్రాల సీజేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.