కోవూరు, న్యూస్‌లైన్ : కోవూరు చక్కెర కర్మాగారంలో ఫిబ్రవరి 16 నుంచి క్రషింగ్ ప్రారంభించి, రైతుల సహకారంతో పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని కర్మాగార చైర్మన్, కలెక్టర్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారంలో శని వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్మాగారం మనుగడకు రైతుల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమన్నారు.
రైతులకు త్వరలో బకాయిలు చెల్లించేలా కృషి చేస్తామన్నారు. చక్కెర కర్మాగారంలో 3,026 మంది వాటాదారులు ఉండగా కేవలం 127 మంది మా త్రమే సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి కోరం లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేయాలను కున్నారు. కర్మాగారం బైలాను అనుసరించి వంద మంది చెరకు రైతులు హాజరు ప్రకారం యథావిధిగా కొనసాగించారు. ఫిబ్రవరి నుంచి ప్రారంభించే క్రషింగ్‌లో 40 నుంచి 60 వేల టన్నుల చెరకును ఆడించే అవకాశముందన్నారు. కర్మాగారానికి చెరకు తోలిన రైతుల బకాయిలు కోట్ల రూపాయల్లో ఉందని, వీటి చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల వడ్డీ లేని రుణం అందజేస్తుందన్నారు.
దేశంలో సీడ్ యాక్ట్ సంస్థ నుంచి రూ. 6.90 కోట్ల రుణం తీసుకుని రైతుల బకాయిలు చెల్లిస్తారన్నారు. ప్రస్తుతం క్రషింగ్ ప్రారంభమయ్యేందుకు ఫ్యాక్టరీ మరమ్మతులకు రూ.1.50 కోట్లు అవసరమన్నారు. ప్రస్తుతం కర్మాగారంలో ఉన్న మొలాసిస్‌ను, స్క్రాబ్, రంగు మారిన చక్కెరను అమ్మితే రూ.94 లక్షలు వస్తాయన్నారు. ప్రస్తుతం చెరకు సరఫరా చేసేై రెతులకు టన్నుకు రూ.2,150 ధర నిర్ణయించినట్లు కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇందులో కర్మాగార మరమ్మతుల కోసం రూ.50 మినహాయించుకుంటామన్నారు. రైతులు చెరకు కర్మాగారానికి సరఫరా చేసిన 15 రోజుల్లోపు రూ.2050 చెల్లిస్తామన్నారు. మిగిలిన మొత్తాన్ని క్రషింగ్ పూర్తయ్యే సమయానికి చెల్లిస్తామన్నారు. గతంలో కర్మాగార ఎండీగా పనిచేసిన సుధాకర్‌రెడ్డి పై విచారణ జరపాలని సీబీసీఐడీని కోరుతామన్నారు.
కేన్ అసిస్టెంట్ కమిషనర్‌పై
కలెక్టర్ ఆగ్రహం
అసిస్టెంట్ కేన్ కమిషనర్ సత్యనారాయణ పనితీరుపై కలెక్టర్ శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పనితీరు చూస్తుంటే పొదలకూరులో ఉన్న గాయిత్రీ షుగర్ ఫ్యాక్టరీతో కుమ్మక్కైనట్లు ఉందన్నారు. రైతులకు రూ.14 కోట్ల బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడంపై రైతులు కోర్టుకు వెళ్లారన్నారు. అప్పటి షుగర్ కేన్ అధికారులు గాయిత్రీ చక్కెర కర్మాగారాన్ని సీజ్ చేసేందుకు వెళ్లారన్నారు. దీంతో గాయిత్రీ ఫ్యాక్టరీ యాజ మాన్యం రైతుల బకాయిలు మూడు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని కో ర్టుకు చెప్పి స్టే తెచ్చుకుందన్నారు. తొలి విడతగా డిసెంబరులో రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా.. ఇంత వరకు చెల్లించలేదన్నారు. న్యాయనిపుణులతో వెంటనే సమావేశమై గాయిత్రీ షుగర్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ కేన్ కమిషనర్ సత్యనారాయణను ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వర్షిణి, కర్మాగార తాత్కాలిక ఎండీ వెంకటసుబ్బయ్య, విశ్రాంత ఎండీ వీరభద్రరావు, రైతు సంఘాల నాయకులు బెజవాడ ఓబుల్‌రెడ్డి, హరికిషోర్‌రెడ్డి, ములుమూడి రామచంద్రారెడ్డి, జెట్టి రామచంద్రారెడ్డి, కోటిరెడ్డి, కాటంరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, హనుమంతునాయుడు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 16న క్రషింగ్ ప్రారంభం
Published Sun, Jan 5 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement