విడిపోతే చెడిపోతాం
=తాగునీటికీ ఇక్కట్లే
=సమైక్యం కోసం పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ
=సమైక్య శంఖారావం సభలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలకు తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఉత్తర నియోజక వర్గం సమన్వయకర్త జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో బుధవారం 33వ వార్డు 80 అడుగుల రోడ్డులో సమైక్య శంఖారావం సభ నిర్వహించారు.
వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీయేనని, తెలుగుజాతి కలిసి ఉండడం కోసం పోరాడే ఏకైక నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ పశ్చిమ నియోజక వర్గ సమన్వయకర్త దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడానికే కిరణ్, చంద్రబాబులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు.
భీమిలి సమన్వయకర్త కోరాడ రాజబాబు మాట్లాడుతూ జగన్ పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దక్షిణ నియోజక వర్గ సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ సోనియా గాంధీ తన కుమారుడ్ని ప్రధానిని చేయడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆరోపించారు. అనంతరం కేంద్ర కార్యవర్గ సభ్యులు పి.ఎస్.ఎన్.రాజు, నగర మహిళా క న్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, ఉత్తర నియోజక వర్గ సమన్వయకర్త రవిరాజు, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడారు.
జై సమైక్యాంధ్ర నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సభ ప్రారంభానికి ముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవిరెడ్డి, కంపా హనోక్, గుడ్ల పోలిరెడ్డి, పక్కి దివాకర్, భూపతిరాజు, జాన్ వెస్లీ, విల్లూరి భాస్కరరావు, ఎ.వి.ఎస్.నాయుడు, నీలి రవి, ఆళ్ళ శ్రీను, వార్డు నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.