డీఎంహెచ్‌ఓతో మాట్లాడుతున్న మంత్రి శిద్దా
ముండ్లమూరు: అధికారుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంలా ఉంది. మండలంలోని పులిపాడులో గ్రామస్తులు డయేరియాతో బాధపడుతూ ఒకరు మృతి చెందగా మరికొంత మంది మంచంపట్టిన విషయం తెలిసిందే. పత్రికల్లో కథనాలు వచ్చిన అనంతరం అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. 16 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. నలుగురు చిన్నారులు బాగా నీరసంగా ఉండటంతో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యశిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్‌ఎ రాజ్యలక్ష్మి సిబ్బందితో పరిస్థితులపై ఆరా తీశారు. పూర్తిగా తగ్గేంత వరకూ మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారి కమలను ఆమె ఆదేశించారు. గ్రామంలో అధ్వానంగా పారిశుద్ధ్యం ఉన్నా పట్టించుకోని అధికారులు.. ప్రజలు ఇబ్బందులు పడ్డాక కళ్లు తెరిచి చర్యలు ప్రారంభించారు. ప్రధాన వీధుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ చల్లించారు. తాగునీటి వనరులు అధ్వానంగా ఉన్నా అధికారులు ఎన్నడూ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు బాధ్యతగా పని చేయాలి
మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం విడనాడి బాధ్యతగా పనిచేయాలని కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున ఆదేశించారు. మండలంలోని పులిపాడును ఆయన సోమవారం సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం గ్రామంలోని తాగునీటి వనరులు, ప్రధాన వీధులను పరిశీలించారు. ఎన్‌ఏపీ నీటి ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన నీటి వాల్వ్‌లో మురుగు పేరుకు పోయి ఉండటంతో ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రధాన వీధులన్నీ మురుగు, చెత్తతో పేరుకుపోయి ఉండడంతో పంచాయతీకి కేటాయించిన నిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులు గ్రామాలను సందర్శించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.
అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అధైర్యపడొద్దని, గ్రామంలో పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తారని ఆర్డీఓ భరోసా ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో బాధితుల పరిస్థితి అదుపులో ఉందన్నారు. 23 మంది అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. వారిలో నలుగురి కోలుకున్నారన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నలుగురు చిన్నారులను సమీపంలోని దర్శి వైద్యశాలకు తరలించినట్లు వివరించారు. ఆర్‌డబ్ల్యూస్ ఎస్‌ఈ సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని నీటి వనరుల నుంచి శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపామని వివరించారు. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పాటు దర్శి నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.రవి, తహసీల్దార్ గంగాధరరావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, వైద్యాధికారి కమల, ఏఈ హనుమాన్‌బాబు, కార్యదర్శి రమేష్ ఉన్నారు.
మెరుగైన సేవలు అందించాలి: మంత్రి
పులిపాడులో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పరిస్థితికి కారణాలను స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. బాధితులందరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. పూర్తిగా తగ్గేంత వరకు వైద్య శిబిరం నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మిని ఆదేశించారు. ఆమె స్పందిస్తూ ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. కొత్తగా ఎవరూ అస్వస్థతకు గురికాలేదని తెలిపారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో శిబిరం కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక అందజేయాలన్నారు. తక్షణమే పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రితో పాటు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవి, తహసీల్దార్ గంగాధర్‌రావు, ఈఓఆర్డీ చూడామణి, వైద్యాధికారులు కమల, వెంకట్రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment