ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో ఒక బాలిక మృతి చెందింది.
నెల్లూరు: ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో ఒక బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. వేగంగా వెళ్తున్న కంటెనర్ లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు తిరుపతి నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
దీంతో వేరే బస్సు కోసం వేచి ఉన్న ప్రమాణికులు బస్సు ముందు రోడ్డుపై కూర్చున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు మందు భాగంలో కూర్చోని ఉన్న హేమజ(16) అక్కడిక క్కడే మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గూడూరులోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.