బాబుది నోరుకాదు..
⇒ ప్రభుత్వానికి పోయే కాలమొచ్చింది
⇒ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు
⇒ వైఎస్సార్ హయాంలోనే అందరికీ మంచి
⇒ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
నెల్లూరు (సెంట్రల్): అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు అడ్డమైన వాగ్దానాలు చేసి, ఇప్పుడు విదేశాల బాటపట్టిన సీఎం చంద్రబాబుది నోరా..తాటిమట్టా..అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఆదివారం జరిగిన సీపీఎం 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి చంద్రబాబు వెనుకాడరని పేర్కొన్నారు. జనానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన రైతులు, డ్వాక్రా మహిళలను కన్నీరు పెట్టిస్తున్నారన్నారు.
టీడీపీకి పోయే కాలం దగ్గరకు వచ్చే ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే..రాబోయే ఆ పార్టీ పాలన తీరు ఎలా ఉంటుందోనని భయమేస్తోందన్నారు. కనీసం పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకపోవడం చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు ఎంత ఇసుక అవసరమైనా ఉచితంగా వచ్చేదన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేదన్నారు. అప్పట్లో ప్రజలందరికీ ఎంతో మంచి జరిగిందన్నారు. ప్రధానంగా రైతు లు సంతోషంగా గడిపారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వాగ్దానాలను విస్మరించి, యువరైతులు సైతం ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తెస్తున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నారన్నారు.
అంగన్‌వాడీలు కూడా తెలుగుదేశంవాడీలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ రెండూ రెండేనని విమర్శించారు. ఇటీవల విదేశీ పర్యటనలంటూ చంద్రబాబు జపాన్ వెళ్లారని, అక్కడి పాలకులు తమ ప్రజలకే ఏమిచేయలేక చేతులెత్తేస్తే బాబు వారిని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో కొన్ని ఊర్లకు బస్సు వెళ్లే దిక్కే లేకపోతే విమానాశ్రయం పెడతామని బాబు దాబులు పోతున్నారని మండిపడ్డారు. ప్రతి ఊర్లో మద్యం షాపు పెట్టి మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు నీళ్లతో కూడా వ్యాపారం చేస్తూ టీడీపీ నేతల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారన్నారు. ఇటీవల వైజాగ్‌లో విజయోత్సవ సభ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు.
పవన్ కల్యాణ్ ఎక్కడ?
ఎన్నికల ముందు టీడీపీ గెలిపించడంటూ మైకులు పగిలేలా మాట్లాడిన సినీనటుడు పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మధు ప్రశ్నించారు. ఓట్ల కోసం ఆవేశంగా మాట్లాడిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు వాగ్దానాల అమలు మాట ఎత్తకపోవడం తగదన్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదు ఓ వ్యాపారం
టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓ వ్యాపారంగా మారిందని మధు విమర్శించారు. తమ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే నారాయణ విద్యాసంస్థలు, కేసినేని ట్రావెల్స్‌లో డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ఎంపిక కమిటీతో పాటు పలు కమిటీల్లో వ్యాపారులను సభ్యులుగా చేసి టీడీపీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటోందన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే వామపక్షాలన్నీ ఏకమై ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, ీమూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, శ్రీరాములు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.