= కొనసాగుతున్న సమైక్య ఉద్యమం
= రిలేదీక్షలు, వినూత్న ప్రదర్శనలు
= నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆటోలు, మోటారుసైకిళ్ల ర్యాలీ
సాక్షి, మచిలీపట్నం : సమైక్య పోరు ప్రారంభమై 78 రోజులు గడిచినా ఉద్యమ వాడివేడీ తగ్గలేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి వీల్లేదంటూ సమైక్యవాదులు ఇంకా ఆందోళన బాటలోనే ఉన్నారు. జిల్లాలో బుధవారం వినూత్న నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. పామర్రులో జేఏసీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
గుడివాడలో జేఏసీ నేతలు, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. మండవల్లిలో పంచాయతీ కాంట్రాక్టు వర్కర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ముదినేపల్లిలో మండల సమైక్యాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవోల దీక్షలు 64వ రోజుకు చేరాయి. మహిళా నేతలు దీక్షలు చేపట్టారు. చల్లపల్లిలో సమైక్యవాదులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఘంటసాలలో అంబేద్కర్‌నగర్‌కు చెందిన డ్వాక్రా మహిళలు దీక్ష చేశారు. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఎదుట మండల డ్వాక్రా గ్రూపు మహిళలు రిలే దీక్షలు చేపట్టారు.
నాగాయలంకలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలలో పర్రచివర శివారు మెరకపాలెం దళితవాడకు చెందిన అంబేద్కర్ సంఘం సభ్యులు దీక్షలో కూర్చున్నారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీ ఉద్యోగ,ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. తొలుత ఎంఎన్‌కే రహదారిపై పొయ్యిలు పెట్టి గారెలు, బజ్జీలు వండుతూ నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు, సమైక్యవాదులు చేస్తున్న నిరసనలు 78వ రోజుకు చేరుకున్నాయి.
కలిదిండిలో జేఏసీ నాయకులు విభజన కమిటీ మంత్రుల దిష్టిబొమ్మను దహనం చేసి జాతీయ రహదారిపై బైఠాయించారు. నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ఆగిరిపల్లి బస్టాండ్ సెంటర్‌ల మండల ఫాస్టర్ల ఫెలోషిప్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. మొవ్వ మండలంలోని ఆశా వర్కర్లు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. వీరు కూచిపూడి సెంటర్లో రాస్తారోకో చేశారు. పెడన మహాత్మాగాంధీ షాఫింగ్ కాంప్లెక్స్‌లో దస్తావేజు రైటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ వీఆర్వోలు ఒకరోజు దీక్ష చేశారు. కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై నృత్యాలు చేస్తూ మహిళలు నిరసన తెలిపారు. సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో...
తిరువూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభాయ్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు 15వ రోజు కొనసాగాయి. కైకలూరులో రిలే దీక్షలు 71వ రోజుకు చేరాయి. గోనెపాడు గ్రామానికి చెందిన మహిళా కార్యకర్త పి.కరుణ ఆధ్వర్యంలో 20 మంది మహిళలు రిలే దీక్షల్లో కూర్చున్నారు.
నేడు డెల్టాకు నీరు నిలిపివేత..
కృష్ణాడెల్టాకు గురువారం సాగునీటి సరఫరా నిలిపివేయాలని ఇరిగేషన్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు నీరందని పరిస్థితి ఉండడంతో సాగునీటి నిలిపివేతపై తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఆటోలు, సైకిల్‌రిక్షాల ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ సమాయత్తమవుతోంది.