సమైక్య ఉద్యమంలో మనదే ముందంజ: షర్మిల
సమైక్య ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉందని పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని.. నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని, విభనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయడంతో ప్రజల్లో మనపట్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు. నిర్ణయం వెలువడక ముందే విభజనను వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటేనని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు కూడా అత్యంత ప్రాధాన్యమైనవని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. మన ఉద్యమానికి ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉద్యమంలో మరింత దూకుడుగా వెళ్తామని తెలిపారు.
నియోజకవర్గాల సమన్వయ కర్తలంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నారని, ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని షర్మిల తెలిపారు. ఓట్ల కోసం సీట్ల కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని,
టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు పూర్తిగా సహకరించారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసమే మనం పోరాడుతున్నామని, రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండడం కోసం పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజీనామాకు ఒత్తిడి పెంచాలని సూచించారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయాలని సమావేశంలో షర్మిల పిలుపునిచ్చారు.