ఉల్లి ఘాటెక్కుతోంది!
- పదిరోజుల్లో రెట్టింపైన ధర
- సాధారణ మార్కెట్‌లో కిలో రూ.24
- సూపర్‌మార్కెట్లలో మేలురకం పేరుతో రూ.34
సాక్షి, తిరుపతి : ఉల్లిగడ్డల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు వారాల్లో కిలో రేటు రెట్టింపు అయింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వంటింట్లో ఉల్లిగడ్డ లేనిదే ఏ కూర ఉడకని పరిస్థితి. ఒక్క తిరుపతి నగరంలోనే రోజుకు 50 టన్నుల ఉల్లిగడ్డలు హోల్‌సేల్ డీలర్ల నుంచి షాపులకు వెళ్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఈ మొత్తం రెట్టింపు ఉంటుందని అంచనా. దీన్నిబట్టి వీటి ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. రెండు వారాల కిందట కిలో ధర రూ.12 ఉండగా అది కాస్తా ఇప్పుడు రూ.24కు చేరుకుంది. సూపర్‌మార్కెట్లలో మేలు రకం గడ్డల పేరుతో రూ.34కు అమ్మకాలు జరుపుతున్నారు. పది రోజుల కిందట వరకు రాష్ట్రంలోని కర్నూలు ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఉల్లి గడ్డలు తిరుపతికి వచ్చేవి.
అక్కడ నుంచి రవాణా చార్జీలు కిలోకు రూపాయి నుంచి రూపాయిన్నర పడేది. కాని అక్కడ నిల్వలు నిండుకోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని పూనా, నాశిక్ నుంచి తెప్పిస్తున్నారు. దీంతో రవాణా భారం భారీగా పడుతోంది. కిలోపైన నాలుగు నుంచి ఐదు రూపాయలు రవాణా ఖర్చులు వేసి హోల్‌సేల్ డీలర్లు రిటైల్ షాపులకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉల్లిగడ్డల ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు డీలర్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఉల్లి కొనుగోళ్లలో పెద్దగా తేడా లేనప్పటికీ ఇంతకంటే ఎక్కువ అయితే అమ్మకాలపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఉల్లి ధరలు ప్రభుత్వాలను మార్చిన చరిత్ర దేశంలో ఉంది. దీంతో కేంద్రప్రభుత్వం ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్త అధికారులు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.