విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో దశాబ్దాల తరబడి భూ సమస్యలు తీరడం లేదు. భూమి ఒకరి పేరున ఉంటే వన్‌బీలో మరొకరి పేరు నమోదై ఉంది. వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరు కనిపిస్తుంటుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు, భూ యజమానులు ఏళ్ల తరబడి తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవవుతున్నారు. రేపురా... రెండు రోజులు పోయిన తరువాత చూద్దాం... అన్న సమాధానలతో రైతులు విసిగివేశారి పోతున్నారు. ప్రతీ ఏటా జమాబందీ నిర్వహిస్తున్నా రికార్డుల పై అట్టలు మాత్రమే మారుస్తున్నారనీ, సర్వే నంబర్లు, ఖాతా నంబర్లలో తప్పులు సవరించడం లేదని రైతులు ఏటా వాపోతునే ఉన్నారు. వీటన్నింటికీ పరిష్కారాన్ని కనుగొనేందుకు ‘‘ మీ భూమి-మీ చేతుల్లో ’’ అన్న కార్యక్రమాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న భూముల వివరాలను తహశీల్దార్ కార్యాలయాల నుంచి తీసుకుంటున్నారు.
మండలాల వారీగా ఉన్న భూమి వివరాలను సీడీల రూపంలో తీసుకుని జిల్లా కేంద్రంలో వాటిని ప్రింట్లు తీసి పంపిణీ చేయనున్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ‘మీభూమి-మీచేతుల్లో’ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరిస్తారు. అనంతరం రైతులకు అందిన ఫారాలననుసరించి వివరాలు సక్రమంగా ఉంటే ఫారంలో పొందుపరచిన కాలమ్‌లో వివరాలు సరిపోయినవి అని ఉన్న చోట రైతు, సంబంధిత భూ యజమాని ఆమోదం తెలపాలి. లేకుంటే ఏఏ వివరాలు లేవన్న విషయాన్ని కూడా సంబంధిత కాలమ్స్‌లో పేర్కొనాలి. అనంతరం వెబ్‌ల్యాండ్‌లో వాటిని ధ్రువీకరించి తాజా పరుస్తారు. ఈ ప్రకారం మీ భూమి-మీ చేతుల్లో కాార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం భూ క్రయవిక్రయాలను నేరుగా వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేస్తారు. దీని వలన ప్రతీ సంవత్సరం రికార్డుల ప్రక్రియ తాజాగా నమోదవుతూ ఉంటుంది. తద్వారా భూ సమస్యలు, రికార్డుల తప్పొప్పులు జరిగే అవకాశం ఉండదు. పలుమార్లు రికార్డులను మార్చేందుకు అధికారులకు, రైతులకు ఇబ్బందులు కూడా ఉండవని జిల్లా అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 12,76,720 ఎకరాలు. ఇందులో పల్లపు భూమి 3,08,904 ఎకరాలుండగా మెట్ట భూమి 5,08,787 ఎకరాలుంది. ప్రభుత్వానికి చెందిన భూమి 4,26,005 ఎకరాలుంది. ఇది కాకుండా 63,882 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు, ఇతర రిజర్వు స్థలాలు కలిపి 30,858 ఎకరాలుంది. ఈ భూ వివరాలను ఏటా తాజా పర్చాల్సి ఉన్నప్పటికీ ఆ పనిజరగడం లేదు. వ్యవసాయ సాగు భూమి (పల్లం, మెట్టు కలిపి)8,17,691 ఎకరాలుండగా ఇప్పటికి వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 4.20లక్షల ఎకరాలని నమోదైంది. కొత్త పద్ధతి ప్రకారం రైతుల నుంచి వచ్చే సవరణల ఆధారంగా ఈ జమాబందీ కార్యక్రమం సక్రమంగా జరిగే వీలుంటుందని చెబుతున్నారు.
త్వరలో షెడ్యూల్ ప్రకటన
ప్రస్తుతం మీ భూమి-మీ చేతుల్లో కార్యక్రమానికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయాల నుంచి భూ వివరాలున్న సీడీలు తీసుకుంటున్నాం. వాటిని ప్రింట్లు తీసి రైతులు, భూ యజమానులకు ఇచ్చి రికార్డులన్నీ తాజా పరుస్తాం. దీనికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తాం. మండలాల్లో నిర్వహించాల్సిన గ్రామ సభల షెడ్యూల్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం త్వరలోనే ప్రకటిస్తాం.
ఆర్ శ్రీలత, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్, విజయనగరం.
త్వరలో భూ సమస్యలకు మోక్షం
Published Sat, Jul 18 2015 12:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement