భద్రాచలం, న్యూస్‌లైన్: పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా నెలకొల్పిన సామాజిక ఆరోగ్య పోషకాహార కేంద్రాల మూసివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కనీస వైద్య సేవలు కూడా అందడం లేదనే ఆలోచనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సరిపడా సిబ్బంది నియామకం...
వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పల్లె ప్రజలకు పకడ్బందీగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా 2010 ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా 360 సామాజిక ఆరోగ్య పోషకాహార కేంద్రాల(క్లస్టర్స్)ను ఏర్పాటు చేసింది. మన జిల్లాలో 17 కేంద్రాలను నెలకొల్పగా వాటిలో 12 సీహెచ్‌ఎన్‌సీలను ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ఒక ఎస్‌పీహెచ్‌ఓ (సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్), సీహెచ్‌ఓ, డీపీఎంఓ, పీహెచ్‌ఎన్, హెల్త్ ఎడ్యుకేటర్, ఎంపీహెచ్‌ఈఓ, ఆప్తాలమిక్ ఆఫీసర్, ఎల్‌డీ కంప్యూటర్‌ను నియమించారు. వీరందరి వేతనాలను మదింపుచేసేందుకు ఒక సీనియర్ అసిస్టెంట్‌ను కేటాయించారు. నాలుగు పీహెచ్‌సీలకు ఒక క్లస్టర్ ఉండేలా తగు ఏర్పాట్లు చేశారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో గల సిబ్బందితో పాటు వీరు తరచూ గ్రామాల్లో పర్యటించి వ్యాధులపై అవగాహన కల్పించటంతో పాటు రోగులకు సత్వరమే తగిన చికిత్సలు అందిచేందుకు శ్రద్ధ చూపాల్సి ఉంది. అదే విధంగా ఆయా పీహెచ్‌సీలకు సంబంధించి ప్రగతి నివేదికలను పకడ్బందీగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. ఈ కేంద్రాల ద్వారానే గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించి ప్రత్యేక ఆస్పత్రులుగా తీర్చిదిద్దాలనేది వీటి లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసమే ఆయా సీహెచ్‌ఎన్‌సీలకు నలుగురు ప్రత్యేక వైద్యులు, వారికి సహాయకులుగా స్టాఫ్ నర్సులు, అటెండర్‌లను నియమించారు.
పర్యవేక్షణ లేక అందని వైద్యం
మూడేళ్లైనా క్లస్టర్ వ్యవస్థ గాడిన పడలేదు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వీటిపై సరైన పర్యవేక్షణ చేయకపోవటంతో ఈ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. పీహెచ్‌సీ వైద్యుల డ్రాయింగ్ అధికారాన్ని తీసివేసి ఎస్‌పీహెచ్‌వోకు అప్పగించిన అధికారులు వీటి ద్వారా ప్రజలకు సేవలందించడంపై మాత్రం శ్రద్ధ చూపటం లేదనే విమర్శలు ఉన్నాయి. క్లస్టర్ ఆస్పత్రులు ఉన్నాయనే విషయం కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో వీటి అవసరాన్ని గుర్తించి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా వచ్చిన నిధులతో పక్కా భవనాలను కూడా నిర్మించారు. కానీ ఉన్నతాధికారులు వీటి పాలనను గాలికొదేలాశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు కనీస సేవలు కూడా అందటం లేదు. క్లస్టర్ కార్యకలాపాల నిర్వహణ కోసం నిర్మించిన భవనాలు కూడా ప్రస్తుత ఆస్పత్రుల్లో ఓ మూలన ఉండటంతో వాటి దగ్గరకు ఏ ఒక్కరూ వెళ్లటం లేదు. వీటిని ఏర్పాటు చేసి మూడేళ్లు కావస్తున్నా గాడిలో పెట్టేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో వీటిని మూసివేస్తారనే ప్రచారం సాగుతోంది.
ప్రభుత్వం పట్టించుకోనందువల్లే..
వ్యాధులు వచ్చినప్పుడు చేసే హడావుడికంటే రోగాలు రాకుండా ఉండేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ఈ క్లస్టర్ ఆస్పత్రులు ఉపయోగపడుతాయని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినా వీటి గురించి పట్టించుకోవడం లేదు. దీనిలో హెల్త్ ఎడ్యుకేటర్ పాత్ర ఎంతో కీలకమని గత ఏడాది డిసెంబర్‌లో అప్పటి వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయినా క్లస్టర్ ఆస్పత్రులకు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేదు. వరంగల్ జోన్ పరిధిలో గల ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో 70 క్టస్టర్‌లు ఉండగా కీలకమైన హెల్‌ఎడ్యుకేటర్‌లు 44 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవనే సాకుతో 26 క్లస్టర్‌లలో హెచ్‌ఈలను నియమించలేదు. ఉన్న వారికి కూడా వరంగల్ ఆర్‌డీ కార్యాలయ అధికారులు అడ్డగోలుగా డిప్యుటేషన్‌లు వేస్తున్నారు. ఏజెన్సీలో ఉన్న క్లస్టర్‌లలో పనిచేస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు డిప్యుటేషన్‌లపై పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విధులకు డుమ్మా కొడుతున్న సిబ్బంది..
సీహెచ్‌ఎన్‌సీలపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో ప్రస్తుతం ఉన్న సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారు. భద్రాచలం డివిజన్‌లోని చర్ల, వెంకటాపురం, చింతూరు, కూనవరం క్లస్టర్‌లను ‘న్యూస్‌లైన్’ శనివారం పరిశీలించింది. చర్ల, వెంకటాపురంలలో అసలు కేంద్రాలే తెరుచుకోలేదు. వెంకటాపురం క్లస్టర్‌కు ప్రత్యేక భవనం ఉన్నా తాళాలు తీయలేదు. చర్లలోనూ అదే పరిస్థితి. దాదాపు అన్ని క్లస్టర్‌లలో పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు. కూనవరం క్లస్టర్‌లో పనిచేసే స్టాఫ్‌నర్సును అవసరం ఉన్నా భద్రాచలం ఆస్పత్రికి డి ప్యుటేషన్ చేయటం గమనార్హం. ప్రభుత్వం సామాజిక ఆరోగ్య పోషకాహార కేంద్రాల నిర్వహణను మెరుగుపరచాలని గిరిజనులు కోరుతున్నారు.
గ్రామహీన వైద్యం
Published Mon, Nov 25 2013 2:57 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement