ఆపరేషన్ గజ...సక్సెస్ | 'Operation Gaja' Success | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ గజ...సక్సెస్

Published Wed, May 20 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

'Operation Gaja' Success

మక్కువ/సాలూరు,రూరల్: ఒడిశా నుంచి వచ్చిన ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు మూడు రోజులుగా  చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.  సుమారు 200 మంది అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది  శ్రమించి ఆపరేషన్ ‘గజ’ను విజయవంతం చేశారు.   చిత్తూరు నుంచి రెండు కొంకిస్( శిక్ష ణపొందిన) ఏనుగులను సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి సోమవారం తీసుకువచ్చారు. అయితే రాత్రి గున్న ఏనుగుజాడ తెలియకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం సాలూరు మండలం రెయ్యివానివలస గ్రామం సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోతట్టు ప్రాంతంలోని వాగువద్ద గున్న ఏనుగు సేదతీరుతుండడాన్ని అధికారులు గమనించారు. మామిడిపల్లినుంచి కొంకిస్ ఏనుగులను  పసుపువానివలస, రెయ్యివానివలస గ్రామాల మీదుగా నడిపించుకుంటూ మధ్యాహ్నం 12గంటల సమయానికి గున్న ఏనుగు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున కొంకిస్ ఏనుగుల అలసట తీరి, అవి సేదతీరేవరకూ వేచి ఉండి సాయంత్రం 4.14నిమిషాలకు ఆపరేషన్ గజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
 ఆపరేషన్ జరిగిందిలా...
  విశాఖపట్నం  జూ డాక్టర్ శ్రీనివాస్   మత్తు ఇంక్షన్ గల తుపాకీతో    జయంతి ఏనుగుపై   కూర్చుని గున్న ఏనుగు ఉన్న ప్రదేశానికి సమీపంలోకి చేరుకున్నారు.   అనంతరం గున్న ఏనుగును జయంతి మచ్చిక చేసుకుంది. జయంతికి తోడుగా వినాయక్ అనే ఏనుగు కూడా గున్న ఏనుగు వద్దకు చేరుకుంది.   అవి గున్న ఏనుగును బహిరంగ ప్రదేశానికి   తీసుకువచ్చాయి.  జూ డాక్టర్  తుపాకీలో లోడ్‌చేసి ఉన్న మత్తు ఇంజక్షను గున్న ఏనుగుపై ప్రయోగించారు. దీంతో అది  సృ్పహతప్పి పడిపోయింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది తాళ్లు, గొలుసులను కాళ్లకు కట్టారు. గున్న ఏనుగుకు కొంత సృ్పహ వచ్చిన వెంటనే కొంకిస్ ఏనుగుల మధ్యన దానిని ఉంచి లారీవద్దకు తీసుకు వచ్చి ఎక్కించారు.   అక్కడి నుంచి విశాఖపట్నం జూకు గున్న ఏనుగును తరలించేందుకు చర్యలు చేపట్టారు.
 
 ముందే....ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టిఉంటే...?.
 అటవీశాఖాధికారులు మందే ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టి ఉంటే పెద్ద ఏనుగు మృతిచెంది ఉండేది కాదని స్థానికులు అభిపాయపడ్డారు. గత నెల 7వ తేదీన ఒడిశా రాష్ట్రం బొలంగీర్ ప్రాంతం నుంచి  సాలూరు మండలం కొట్టుపరువు గ్రామంలోకి ప్రవేశించిన  రెండు ఏనుగులు  నెలరోజులుగా మక్కువ, సాలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో   సంచరించాయి.   
 
 ఈ నెల 11వ తేదీన గాదిపల్లివలస గ్రామం సమీపంలోని అరటితోట వద్ద విద్యుత్‌వైర్లు తగలడంతో పెద్ద ఏనుగు మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆపరేషన్ గజను చేపట్టిన అధికారులు గున్న ఏనుగును పట్టుకోగలిగారు.  కార్యక్రమంలో అడిషనల్ సీసీఎఫ్ ప్రదీప్‌కుమార్, విజయనగరం డీఎఫ్‌ఓ ఐకేవీ రాజు, శ్రీకాకుళం డీఎఫ్‌ఓ బి.విజయకుమార్, విశాఖపట్నం స్క్వాడ్ డీఎఫ్‌ఓ బి.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement