
నేటి నుంచి ఆప్షన్లు
రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధమైంది.
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధం
35 శాఖల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్న కమలనాథన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను పంపిణీ చేయగానే ఆ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ అధ్యక్షతన గల రాష్ట్ర సలహా కమిటీ చేపట్టనుంది. ఇప్పటికే రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 67 శాఖలకు చెందిన వివరాలను కమలనాథన్ కమిటీ నోటిఫై చేసింది. 35 శాఖల పోస్టుల పంపిణీపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ శాఖల్లోని పోస్టులకు చెందిన ఉద్యోగులు ఇప్పటికే ఫామ్-3లో అన్ని వివరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఈ 35 శాఖలకు చెందిన రాష్ర్ట స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఆప్షన్లను తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఉన్న ఆప్షన్ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను నింపి ఇవ్వాల్సిందిగా ఆయా ఉద్యోగుల సెల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లను పంపనున్నారు. ఆప్షన్లు ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వనున్నారు. విభజన చట్టంలోని మార్గదర్శకాల మేరకు ఏ రాష్ట్ర్రానికైనా కేటాయించవచ్చునని స్పష్టం చేశారు.
ఆప్షన్ పత్రంలో పేర్కొన్న ముఖ్యాంశాలు..
- ఏ శాఖలో పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వానికి చెందిన ఏ కేటగిరీ పోస్టులో ఉన్నారు.
- ఏ సర్వీసుకు చెందిన ఉద్యోగి. శాఖ యూనిట్ పేరు. ఏ కేటిగిరీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి.
- సర్వీసు రిజిస్టర్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగి గుర్తింపు నంబర్
- పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం/గ్రామం, పట్టణం, జిల్లా పేరు.
- సొంత జిల్లా.
- సామాజిక హోదా: ఎస్సీ/ ఎస్టీ,/బీసీ/ ఇతర. వివాహం అయిందా లేదా?
- ప్రభుత్వ సర్వీసులో చేరిన సంవత్సరం
- తొలి పోస్టింగ్ హోదా. ప్రాంతం
- 1975 ప్రభుత్వ ఉద్యోగుల సంబంధిత ఉత్తర్వుల (రాష్ట్రపతి ఉత్తర్వులు) ప్రకారం స్థానికుడైతే.. ఏ ప్రాంతం, ప్రస్తుతం ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది.
ఉద్యోగంలో చేరడానికి అర్హత పరీక్షకు ముందు ఏడేళ్లు ఎక్కడ, ఏ విద్యా సంస్థలో చదివారు?/ టెన్త్‌కు ముందు ఏడేళ్లు ఏ విద్యా సంస్థలో, ఎక్కడ చదివారు?
- సంబంధిత ఉద్యోగానికి ఎటువంటి విద్యార్హత లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారు ఆ పోస్టు నోటిఫికేషన్ తేదీకి ముందు ఏడేళ్లు ఎక్కడ నివాసం ఉన్నారో తెలియజేయాలి. చదివిన సర్టిఫికెట్ లేదా నివాస స్థలం సర్టిఫికెట్ జత చేయాలి.
- తొలి పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో తెలియజేసే ధ్రువీకరణ/ ఆ పోస్టు ప్రస్తుతం ఉందా?
- ఆఫీస్ చిరునామా
- ప్రస్తుతం ఉన్న పోస్టులో నియామకానికి అనుసరించిన విధానం డెరైక్ట్ రిక్రూట్‌మెంట్/ పదోన్నతి/ బదిలీ.
- ప్రస్తుతం ఉన్న పోస్టులో రెగ్యులర్ నియామకమా/తాత్కాలిక నియామకమా/ఇన్‌చార్జా?
- ప్రస్తుతం చేస్తున్న పోస్టు మీ స్థాయికి తగినట్లు ఉందా.
- ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకు కాలపరిమిత ఉందా/డెప్యుటేషన్/సెలవు/సస్పెన్షన్.. సంబంధిత వివరాలు.
- ఏ రాష్ట్రానికి కేటాయించాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ. అందుకు గల కారణాలు.